ప్రకాశం జిల్లా దివాకరపల్లి వద్ద రిలయన్స్ సీబీజీ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన -రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ -రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్, 2.50 లక్షల మందికి ఉపాధి -వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం

రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటుచేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు. దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటుచేస్తోంది. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లను స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సీబీజీ హబ్ లను ఏర్పాటుచేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేస్తోంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, సీఎస్ కె.విజయానంద్, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎమ్.అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దర్శి ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మాజీ ఎమ్మెల్యే ఎన్. పాపారావు, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు సీబీజీ… రేపు ఇండో సోల్… త‌రువాత బీపీసీఎల్…
లోకేష్ పాద‌యాత్ర‌లో చెప్పారు… 9 నెల‌ల్లో చేశారు…
వెనుక‌బ‌డిన ప్ర‌కాశం జిల్లాకు రూ.1.50 ల‌క్ష‌ల‌ కోట్లకు పైగా పెట్టుబ‌డులు -కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తుంది- ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

లోకేష్ పాద‌యాత్ర సంద‌ర్భంగా వెనుక‌బ‌డిన ప్ర‌కాశం జిల్లాకు ఏదో ఒక‌టి చేయాల‌ని ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి… అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెల‌ల్లోనే రూ. 650 కోట్ల‌తో రిల‌య‌న్స్ సీబీజీ ప్లాంట్ ను క‌నిగిరికి తెచ్చార‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో రిల‌య‌న్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మంత్రి నారా లోకేష్ తో క‌లిసి పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ… చంద్ర‌బాబు నాయుడు వంటి వ్య‌క్తి ముఖ్య‌మంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని తెలిపారు. ఆర్థిక, కులాల మ‌ధ్య‌ అస‌మాన‌త‌లు తొల‌గాల‌నే… పీ4 వంటి కార్య‌క్ర‌మాలు తీసుకు వ‌స్తున్నార‌ని వివ‌రించారు. అంద‌రూ స‌మానంగా జీవించాల‌నేదే సీఎం చంద్ర‌బాబు ఆశ‌య‌మ‌న్నారు. ఒక్క అవ‌కాశం ఇచ్చినందుకు రాష్ట్రం 20 సంవ‌త్స‌రాలు వెనక్కి పోయిన విష‌యాన్ని ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నించాల‌ని మంత్రి గొట్టిపాటి కోరారు. 9 నెల‌ల్లోనే ఇంత అభివృద్ధి జ‌రిగితే… ఐదేళ్ల‌లో ఎంత అభివృద్ధి జ‌రుగుతుందో మాట‌ల్లో చెప్పాల్సిన ప‌ని లేద‌ని., ప్ర‌జ‌లే చూస్తార‌ని స్ప‌ష్టం చేశారు. అడ‌వి లాంటి ప్రాంతాల్లో రైతుల మేలు కోరి రిల‌య‌న్స్ సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేయ‌డం కూట‌మి ప్ర‌భుత్వం వ‌ల్లే అవుతుంద‌న్నారు. రాబోయే ఐదేళ్ల‌లో ప్ర‌జా మ‌ద్ధ‌తు కావాల‌ని కోరిన మంత్రి గొట్టిపాటి… నేడు సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేసిన‌ట్లుగానే కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో త్వ‌ర‌లో రూ.50 వేల కోట్ల‌తో ఇండోసోల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామ‌ని, ఆ త‌రువాత రూ.ల‌క్ష కోట్ల పెట్టుబ‌డితో బీపీసీఎల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు.
కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌న్నింటినీ అమ‌లు చేస్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. 20 ల‌క్ష‌ల ఉద్యోగాల హామీ అమ‌లు దిశ‌గా అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ప్ర‌కాశం జిల్లా బంజ‌రు భూముల్లో ప్లాంట్ల నిర్మాణంతో నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌న్నారు. అదే విధంగా ప్రైవేటు భూముల‌కు రూ.31 వేలు, ప్ర‌భుత్వ భూముల‌కు రూ.15 వేలు కౌలును రిల‌య‌న్స్ సంస్థ చెల్లిస్తుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌ను, సోలార్ ప్లాంట్ల నిర్మాణ‌దారుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి రాష్ట్రం నుంచి త‌రిమి కొట్టింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివ‌రించారు. డిఎస్సీ ద్వారా త్వ‌ర‌లోనే 16 వేల టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. అదే విధంగా త‌ల్లికి వంద‌నం, అన్నదాత సుఖీభ‌వ ప‌థ‌కాల‌ను త్వ‌ర‌లోనే అమలు చేస్తామ‌ని తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని బాట‌లు వేసే నాయ‌కుడే సీఎం చంద్ర‌బాబు అని… హ‌త్య‌లు, మాన‌భంగాలు చేసే వాళ్లు కూడా సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి డోలా బాల‌వీరాంజ‌నేయ స్వామి, క‌నిగిరి ఎమ్మెల్యే ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వ‌ర‌రావు, గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, సీఎస్ విజ‌యానంద్, ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి, రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌తినిధులు పీఎంఎస్ ప్ర‌సాద్, మాధ‌వ‌రావు, హ‌రింద్ర కే త్రిపాఠి, కూట‌మి నేత‌లు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… 14,323 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ప్రధమ స్థానంలో ఉందన్నారు. ఈ జిల్లా 22,88,026 మంది జనాభా కలిగి 5 లక్షల 47 వేల 350 మంది రైతులతో వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ జిల్లాలో ఒక లక్షా 16 హెక్టార్స్ బీడు భూములు కలిగి ఉండగా, అందులో కనిగిరి ప్రాంతంలో అత్యధిక భూములు కలిగి వున్నాయన్నారు. పారిశ్రామిక మరియు ఆర్ధిక రంగాల్లో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఎపి నెడ్ క్యాప్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి జిల్లాలో 5 మండలాలు పెద చెర్లోపల్లి, కొనకనమిట్ల, కురిచేడు, తర్లుపాడు, కొమరోలు మండలాల పరిధిలో 4,993 ఎకరాల ప్రభుత్వ భూమిని 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ను నిర్మించుటకు కేటాయించడం జరిగిందన్నారు. సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడితో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు ద్వారా ప్రతి రోజు 80 మెట్రిక్ టన్నుల సిబీజీ గ్యాస్ ఉత్పత్తి లక్ష్యం కాగా, రానున్న 5 సంవత్సరాలలో ప్రతి రోజు 100 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కి చేరుకుంటుందన్నారు. జిల్లా లో ఈ ప్రాజెక్ట్ వలన సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఎన్నో కుటుంబాలకు ఉపాధి సౌకర్యం కలుగుతుంది. దీనివలన పారిశ్రామికాభివృద్దికి దోహదపడుతూ జిల్లా జిడిపి ని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్స్ ఏర్పాటు వలన ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ హబ్ గా అభివృద్ధి చేయడానికి మొదటి అడుగు వేసిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ప్రకాశం జిల్లా అభివృద్దిని, కీర్తిని పెంచడానికి, శ్రామికులకు ఆర్ధిక భరోసా ని కల్పించడానికి, వలసలు తగ్గించి ఉపాధి సౌకర్యం పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారిని భాగస్వాములుగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు ను ఏర్పాటుచేసినందుకు జిల్లా ప్రజానీకం తరపున జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *