ఒంగోలు నగరంలోని నిర్మల్ నగర్ లో నిర్వహిస్తున్న 32వ వసంత నవరాత్రి ఉత్సవాలు చైత్ర శుద్ధ పాఢ్యమి మార్చి 30వ తేదీ ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ ననవమి వరకు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా 7వ తేదీ స్వామివారి నగర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు.
కార్యక్రమాల్లో భాగంగా 2వ తేదీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కోలాట మండలి వారిచే అద్భుతంగా కోలాట ప్రదర్శన జరిగింది. 3వ తేదీ నిర్మల్ నగర్ శ్రీ సత్య సాయి బాబా బాలవికాస్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు కనుల పండుగ సాగాయి. అనంతరం తడికమళ్ళ హరిప్రసాద్ నిర్వహణలో పురాణ క్విజ్ కార్యక్రమం సభా సదుల మేధస్సుకు పదును పెట్టింది.
బాలవికాస్ విద్యార్థులు సుభాష్ చంద్ర గుప్త మరియు కాశీల యాంకరింగ్ లో స్పందన, సుమనస్వినిలు గణనాధుని ప్రార్ధిస్తూ చేసిన నృత్యం అలరించింది. చిన్నారులు కాన్విక, జ్ఞానశ్రీ, శ్రీవిద్య, గాయత్రి, తన్విశ్రీ, తీక్షిత, జయంత్, రిషి, దేవాన్ష్, రియాన్ష్ లు పద్యాలు, శ్లోకాలను చక్కగా ఆలపించారు. మూషికవిహన మోదక హస్త అనే కీర్తనకు ఆర్. స్పందన చేసిన శాస్త్రీయ నృత్యం, హరహర మహాదేవ శంభో శంకర పాటకు జి. రాధా రమణి శాస్త్రీయ నృత్యం సభికులను ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో ఎవరుగొప్ప అనే నాటకం సభాసదులను ఆలోచింపచేసింది. దేవాన్ష్ కుమార్ మరియు జయంత్ లు పద్య సూక్తి రూపంలో పెద్దల మాట చద్దన్నం మూట ను చక్కగా వివరించారు. చివరిగా దాండియా నృత్యం మరింతగా ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భముగా బాలవికాస్ గురువులు లత, గురువర్ధిని, స్వరాజ్యలక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబములో మంచినడవడిక, దేశభక్తి దైవ భక్తిని పిల్లలనుండియే నేర్పుటకు మంచి మార్గంలో నడవడానికి భగవాన్ సత్యసాయిబాబా వారు బాలవికాస్ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారని, కావున ప్రతి గృహము నుండి మీ పిల్లలను బాలవికాస్ తరగతులకు పంపవలసినదిగా తద్వారా సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడాలని కోరారు.




