బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని, స్వాతంత్రానికి ముందు మరియు తరువాత దేశ రాజకీయాల్లో సఫలత చెందిన రాజకీయ వేత్తగా, దేశభక్తుడిగా, షెడ్యూల్ కులాల వికాసానికి, అధికారానికి జీవితాంతం పోరు సల్పిన మహానాయకుడు, దైవ భక్తుడని విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లా కార్యదర్శి ఈమని బలరాం పేర్కొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఒంగోలు ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలాంకృతం చేసి జోహార్లు అర్పించారు.
కార్యక్రమంలో ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు మాట్లాడుతూ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి వాసంతి దేవి పెంపకంలో ధార్మిక భావాలతో సంస్కారవంతమైన జీవితాన్ని దేశం పట్ల ధర్మం పట్ల స్వాభిమానమును గర్వమును పెంపొందించుకున్నారని, ప్రతి ఆదివారం తులసీదాస్ విరచిత రామచరిత మానస్ ను పారాయణాన్ని తమ ఇంటిలో కొనసాగిస్తూ… ఆ రామాయణ కావ్య అర్ధాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తెలిపే వారని వివరించారు. తమ చిన్ననాటినుండే అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ సమాజంలో సమరత భావాలను పెంచడానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. భారత దేశ రాజకీయాలలో అతి చిన్న వయసులోనే పలు శాఖలకు మంత్రిగా అప్రతిహాసంగా 30 సంవత్సరాల పాటు వివిధ బాధ్యతలను నెరపారని వివరించారు.
ప్రతి ఒక్కరూ స్వర్గీయ జగజీవన్ రావు స్ఫూర్తితో దేశభక్తి దైవభక్తి సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, ప్రచార ప్రముఖ్ రాధారమణ గుప్తా జంధ్యం, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, బోయపాటి రవి, దేసు వెంకయ్య, హరిబాబు, ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.



