మత్స్యకారుల సంక్షేమానికి, వారి ప్రాంతాలసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డా. డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి

 మత్స్యకారుల సంక్షేమానికి, వారి ప్రాంతాల
సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డా. డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి
స్పష్టం చేశారు. ” మత్స్యకారుల సేవలో… ” కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సోమవారం సింగరాయకొండ మండలం పాకల పల్లెపాలెంలో నిర్వహించిన బ్యాంకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
        ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు.  కొండపి నియోజకవర్గంలో 1556 మంది మత్స్యకారులకు రూ.3.11 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలుగుతున్నట్లు మంత్రి చెప్పారు. సింగరాయకొండ మండలంలో 1465 మంది, టంగుటూరు మండలంలో 91 మంది మత్స్యకారులకు 20వేల రూపాయలు చొప్పున లబ్ధి కలుగుతున్నట్లు తెలిపారు. గతంలోనూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. వేట సమయంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల చంద్రన్న బీమా అందించామని , సబ్సిడీపై మోపెడ్లు, ఆటోలను ఇచ్చామని అన్నారు. 2014 – 19 కాలంలో మూడు తుఫాను షెల్టర్ లను నిర్మించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మత్స్యకారుల సంక్షేమానికి, వారి నివాస ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే పాకల గ్రామంలో ఒక కోటి 20 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టడమే దీనికి నిదర్శనం అన్నారు. మత్స్యకారుల కుటుంబాల్లోని బాలికలు చదువుకోవడానికి సింగరాయకొండలో పాఠశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ దిశగా ఇప్పడికే స్థలం కూడా కేటాయించామని తెలిపారు. పాకలలో లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. పోతయ్య పాలెంలో బీచ్ రోడ్డును రెండు నెలల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫిష్ డ్రయింగ్ ప్లాట్ఫారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బిసి కార్పొరేషన్ రుణాలలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పాకలకు రామతీర్థం మంచినీళ్లు తీసుకు రావడంపై దృష్టి సారిస్తామన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ పాకలను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. జిల్లాలో 50 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, జిల్లా అభివృద్ధిలో ఇది కీలకంగా మారేలా దృష్టి సారించామన్నారు. ప్రతి ఏడాది 15% చొప్పున మత్స్యరంగం అభివృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నియోజకవర్గాల వారీగా రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంట్లో ఈ కోణాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు చెప్పారు.
     ముందుగా 30 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్డులు, సైడు కాలువలను, రూ.15 లక్షలతో నిర్మించిన పల్లెపాలెం బీచ్ రోడ్డును వారు ప్రారంభించారు.
     అనంతరం తీర ప్రాంతంలోని కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రివర్యులను, కలెక్టర్ ను స్థానికులు ఘన స్వాగతంతో ర్యాలీగా తీసుకువెళ్లారు.
మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, సింగరాయకొండ ఎంపీడీవో జయమణి, తహసీల్దార్ రవి, టంగుటూరు తహసిల్దార్ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, పరిసర గ్రామాల మత్స్యకార కాపులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *