కంటోన్మెంట్, మే 1(జే ఎస్ డి ఎం న్యూస్)
భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. గురువారం కంటోన్మెంట్ పరిధిలోని 5వ వార్డు లోభారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు- జై భీం- జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర 5వ వార్డు ఇంచార్జ్ పెద్దల నరసింహ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ నగర్ నుంచి దుర్గయ్య గార్డెన్, హనుమంతరావు గార్డెన్, గణేష్ నగర్, ఓల్డ్ సంజీవయ్య నగర్, సెకండ్ లక్ష్మీ నగర్ మీదుగా సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్ పార్క్ అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలి సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్, కార్యక్రమ కోఆర్డినేటర్ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత తో పాటు వార్డు 5 కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒక సారి జరగాల్సి ఉందని .. 2015 ఎన్నికల తరువాత 2020 ఫిబ్రవరిలో మళ్లీ ఎన్నికలు జరగాలని కాని 5 ఏళ్లు గడిచిపోయి 2025 వచ్చినా కేంద్రం ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు కాలపరిమితి దాటి పోయి 5 ఏళ్లయినా కూడా ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ సభ్యులతో పబ్బం గడుపుతున్నారని, ప్రజా ప్రతినిధులు లేక, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అందుకే బిజెపి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

