కార్డన్ సెర్చ్ పేరుతో పోలీసులు సాక్షి దినపత్రిక సంపాదకుడు ఆర్. ధనంజయరెడ్డి ఇంటిలో తనిఖీలు చేసిన తీరును ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎ.పి.యు.డబ్ల్యూ.జే.) ఖండించింది.
ఆమేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు , ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ , ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ఏచూరి, సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వి. రమణారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విజయవాడలో సాక్షి సంపాదకుని ఇంటిలో పోలీసులు బలవంతంగా చొరబడి తనిఖీలు చేసిన ధోరణి దిగ్బ్రాంతి కలిగించిందని , పాత్రికేయులను భయపెట్టడానికి మాత్రమే పోలీసులు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్లు తాము భావిస్తున్నామని యూనియన్ నాయకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక ప్రముఖ పత్రికా సంపాదకుని ఇంటిలో సోదాలు జరపాలని పోలీసులు భావించి ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి ఉండాల్సిందని , పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలో చొరబడిన తీరు గర్హనీయమని యూనియన్ నాయకులు ఆ ప్రకటనలో ఆక్షేపించారు.
ప్రభుత్వ పెద్దలకు సాక్షి యాజమాన్యంపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సాక్షి జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు భావించాల్సి వస్తున్నదని , ఇలాంటి ధోరణి భావ్యం కాదని, సాక్షి పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం , సంపాదకుని ఇంటిలో సోదాలు చేయడం పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేయడానికేనని , యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల అత్యుత్సాహాన్ని నియంత్రించాలని , ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే, ఐ.జే.యూ నేతలు డిమాండ్ చేశారు.