ఎన్టీఆర్.. చరణ్ లతో స్క్రీన్ షేరింగ్ కు రెఢీ అన్న మిస్ జపాన్ జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తర్వాత జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్).. రాంచరణ్ లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదెంత ఎక్కువన్న విషయం ఈ మధ్య కాలంలో మీడియాలో కథనాల రూపంలో వస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణుల్లో మిస్ జపాన్ కియానా తుమీత ఒకరు. ఆమె తన గురించి.. తానెంతో అభిమానించే తారక్.. రాంచరణ్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విపత్తులు.. వైపరీత్యాల మీద పీహెచ్ డీ చేసే తుమీత.. కేంబ్రిడ్జ్.. ఎడింబరో వర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశారు. ఒక బిజినెస్ చానల్ లో యాంకరింగ్ చేసే ఆమె.. తాను జపనీస్ కాలిగ్రాఫర్ అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆమె ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తారు. ఎంతో డెవలప్ అయిన జపాన్ లోనూ.. స్త్రీ.. పురుష వివక్ష ఎక్కువే ఉందన్న విషయాన్ని ఒప్పుకున్నారు. విద్య విషయంలో తమ దేశంలో అమ్మాయికి..అబ్బాయిలకు సమాన అవకాశాలు ఉన్నప్పటికి.. లీడర్ షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యమని చెప్పారు. అంతేకాదు.. సమానమైన పనికి మహిళల కంటే కూడా పురుషులకే వేతనాలు ఎక్కువని చెప్పారు. క్రమశిక్షణ.. పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతి దేశం జపాన్ వైపు చూస్తుందని.. కానీ టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం భారత్ ను తాము ప్రశంసిస్తామని చెప్పారు.కొత్తగా వచ్చిన ఏ సాంకేతిక మార్పునైనా ఇట్టే అర్థం చేసుకొని రాణించటం భారతీయులకే చెల్లుతుందని ఆమె చెబుతారు. భారత్ లో జరిగే నేరాల గురించిన వార్తల్ని చదవినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యానని.. కానీ ఇక్కడి మనుషులు.. వారిచ్చే మర్యాద చూసిన తర్వాత తనలోని భయాలు తగ్గాయన్నారు. తాను హైదరాబాద్ కు వచ్చేటప్పుడు దుబాయ్ మీదుగా వచ్చానని.. అక్కడ బోర్డింగ్ లో తన లగేజ్ తో ఇబ్బంది పడుతుంటే.. ఒక భారతీయుడు తనకు ఎంతో సాయం చేశాడని చెప్పింది. అప్పుడే తనకు ఇండియా మీద గౌరవం రెట్టింపు అయినట్లు చెప్పింది. జపాన్ లో నాటు నాటు పాట చాలా ఫేమస్ అని.. ఆ సినిమా అంటే తనకు ఇష్టమన్న కియానా తుమీత.. తనకు అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో నటించేందుకు సిద్దమని చెప్పింది. భాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. షారూఖ్ ఖాన్ కు వీర ఫ్యాన్ గా చెప్పింది. తాను చెప్పాల్సింది చెప్పేసిన మిస్ జపాన్ కు.. మరి టాలీవుడ్ దర్శకులు అవకాశాలు ఇస్తారా? అన్నది చూడాలి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *