పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ ను పొగాకు రైతులు కలుసుకొని తమ సమస్యను తెలియజేశారు. వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడు కు ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు. దీనికి అచ్చంనాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై ఇప్పటికే పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు, బోర్డు అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. 20 కి.మీ. లోపు రవాణా చార్జీలను చెల్లించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు.

