కూకట్ పల్లి మే 16(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
కూకట్పల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసి కమిషనర్ ను కోరారు.
వరదనీటి కాలువల నిర్మాణం వర్షాకాలానికంటే ముందే పూర్తి చేయాలన్నారు.మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధులను మంజూరు చెయ్యాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ని కలిసి కోరారు. నియోజవర్గం కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, సబిహా గౌసుద్దీన్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బాబూరావు, మాధవరం రంగారావు లతో కలిసి శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం, పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోసం వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా బాలానగర్, ఫతేనగర్, అల్లాపూర్, బాలాజీనగర్, కెపిహెచ్ బి కాలనీ ప్రాంతాల్లో సగం వరకు పనులు పూర్తయిన వరదనీటి కాలువల నిర్మాణం పనులకు మిగతా నిధులను విడుదల చేసి పనులు వర్షాకాలం లోపు పూర్తయ్యేలా చూడాలని కోరారు. అదేవిధంగా ఫతేనగర్ వద్ద ఆర్ వో బి, ఆర్ యు బి నిర్మాణం త్వరితగతిన పనులు చేపట్టాలని కోరారు.
స్మశాన వాటికల అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు. నిధుల కొరత పేరుతో గతంలో చేపట్టిన అనేక పనులను పెండింగ్లో పెట్టారని వాటిని సత్వరం చేపట్టాలని కోరారు. వీధి దీపాల నిర్వహణను గాలికి వదిలేశారని రాత్రివేళల్లో విధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్నిచోట్ల మిగిలిపోయిన సిసి రోడ్ల నిర్మాణం పనులు కూడా చేపట్టాలని కోరారు. డివిజన్ల వారీగా నెలకొన్న సమస్యలను ఆయా కార్పొరేటర్లు కమిషనర్ కు వినతిపత్రం రూపంలో అందజేశారు. స్పందించిన కమిషనర్ ఆర్ వి కర్ణన్ వెంటనే కూకట్పల్లి జోనల్ కమిషనర్ కు ఫోన్ చేసి ఎమ్మెల్యే సూచించిన పనులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని, అందుకు అవసరమయ్యే నిధులను కూడా మంజూరు చేయాలని సూచించారు. వారం రోజుల్లో వీధి దీపాల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదనపు అంతస్తులను మాత్రమే సీజ్ చేయండి….
కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల పేరుతో సుమారు 44 భవనాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారని, అనుమతులు ఉన్న ఫ్లోర్లను ఏవిధంగా సీజ్ చేస్తారని ఎమ్మెల్యే కమిషనర్ ను ప్రశ్నించారు. పక్కా నియోజకవర్గంలోని అనేక కాలనీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జీరో పర్మిషన్ భవనాలు కోకొల్లలుగా ఉన్నాయని వాటిని వదిలేసి అనుమతులు తీసుకున్న భవనాలను ఏవిధంగా సీజ్ చేస్తారని అడిగారు. దీంతో స్పందించిన కమిషనర్ కర్ణన్ జోనల్ కమిషనర్ కు ఫోన్ చేసి అనుమతులు ఉన్న ఫ్లోర్లను వదిలేసి అనుమతులు లేని అదనపు ఫ్లోర్లను సీజ్ చేయాలని ఆదేశించారు.

