ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఎంపిడిఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ , ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లు, డిఎల్డివోలు, డిఎల్పిఓలు, ఈఓఆర్డీలు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జి.ఎస్.డబ్ల్యు.ఎస్, ఉపాధి హామీ పధకం పనుల పురోగతి, హౌసింగ్ పురోగతి, ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమంపై మరియు యోగాంధ్ర క్యాంపెయిన్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకనుగుణంగా ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికలు రుపొందించాలన్నారు. 2029 సంవత్సరం నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతంకు పెంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుండి నవంబర్ మాసం వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం ఉండగా, ప్రకాశం జిల్లాలో 36 శాతం ఉందన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి నవంబర్ మాసం వరకు జిల్లాలో 35 లక్షల 75 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ లక్ష్య సాధనకు ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికలు రుపొందించుకుని కృషి చేయాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 5 వేల మొక్కలు నాటేలా ఎంపిడిఓ లు ప్రణాళికలు రూపొందించి ఎన్ని మొక్కలు అవసరమో పూర్తి వివరాలను సామాజిక అటవీ శాఖ అధికారికి అందజేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న నర్సరీల కేంద్రాలు ఉన్న ప్రాంతాల వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని సామాజిక అటవీ శాఖ అధికారికి సూచించారు. ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వ భూముల్లో ను, రోడ్లుకు ఇరువైపులా, స్కూళ్లు , కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో, నిర్మాణాలు పూర్తి కాబడిన పారం ఫాండ్స్ పై మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షా కాలం రానున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో ప్రతిరోజూ నిర్వహిస్తూ దోమలు విజృంభించకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ సీజన్లో మలేరియా, డెంగీ, విష జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని, దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై పంచాయితీ కార్యదర్శలు, ఈఓపిఆర్డిలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే త్రాగునీరు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వం జారీచేసిన షెడ్యుల్ ప్రకారం యోగాంధ్ర క్యాంపెయిన్ విజయవంత చేసేలా ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా కు నిర్దేశించిన లక్ష్యం మేరకు యోగాంధ్ర క్యాంపెయిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ రోజుకు ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇదే స్పూర్తితో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా అధికారులు కృషి చేయాలన్నారు.
గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణాలలో పురోగతి లేకపోతే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలలో పురోగతి కనిపించాలని, ప్రస్తుతం లెంటిల్ దశలో ఉన్నవి స్లాబ్ దశకు, స్లాబ్ వేసినవి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 12వ తేదీన మెగా గృహప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందున నిర్దేశించిన లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలను పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఎంపిడిఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జన్ మన్ కార్యక్రమం కింద చేపట్టే గృహ నిర్మాణాలపై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున, త్వరగా ఇళ్ళ నిర్మాణాలను పూర్తీ చేసేలా సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జి.ఎస్.డబ్ల్యు.ఎస్ అంశాలకు సంబంధించి పెండింగ్ లో వున్న అంశాలను వేగంగా పూర్తి చేయాలని, అలాగే పిల్లల ఆధార సీడింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్, ఆదేశించారు. వాట్సాప్ గవరెన్స్ సేవలపై రూపొందించిన క్యూ ఆర్ కోడ్ విధానాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పధకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఫారం పాండ్స్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఫారం పాండ్స్ నిర్మాణాలను పూర్తీ చేసేలా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లేబర్ మొబిలైజేషన్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు కూలీలకు రోజువారి సగటు వేతనం పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో డిఎఫ్ఓ సోషల్ పారెస్ట్ రాజశేఖర్, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర రావు, తదితర అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓ లు, ఎంపిడిఓ లు, ఈఓపిఆర్డిలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.

