ఫ్యామిలీ క్లబ్ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో సామాజిక సేవలు, అవసరార్థులకు నిత్యవసరాలు, విద్యార్థులకు విద్యాసామగ్రితో పాటుగా కాలేజీ ఫీజులు, గో సేవలో భాగంగా గోమాతలకు దానా అందించడం జరుగుతుందని, “ఐక్యతే మా బలం” అనే నినాదంతో “మానవ సేవయే మాధవ సేవ” భావంతో ప్రతి నెలా… నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వడం జరుగుచున్నదని ఫ్యామిలీ క్లబ్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు తెలిపారు.
కొత్తపట్నం నల్లూరి గార్డెన్ లో ఫ్యామిలీ క్లబ్ తొమ్మిదవ వార్షికోత్సవం వేడుకలు అత్యంత సందడిగా సభ్యుల హుషారైన స్పందనలతో క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ తహసిల్దార్ సయ్యద్ ఇస్మాయిల్ మరియు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం పాల్గొన్నారు. రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ… క్లబ్ సభ్యులు ఒకరినొకరు అనుసరిస్తూ ఆలోచనలను కలిపి జోడించుకుంటూ చిరస్మరణీయ క్షణాలను సృష్టిస్తున్నారని నేను అనే ఏక భావం వీడి మనం మనందరం ఒకటే అంటూ.. అందరి పట్ల విశ్వాసం కలిగి, ప్రతి సంవత్సరం మరో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న ఫ్యామిలీ క్లబ్ సభ్యులు వసుదైక కుటుంబం అనే భావంతో సమాజంలో ఉన్నత సేవలు అందించడం స్ఫూర్తివంతమని అభినందించారు. సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ… ఫ్యామిలీ క్లబ్ సభ్యులు గత 2017 సంవత్సరం నుండి ఉన్నతమైన లక్షణాలతో లక్ష్యాలతో సమాజ సేవలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసిన క్లబ్ సభ్యులకు వివిధ పోటీలను సయ్యద్ ఇస్మాయిల్ నిర్వహించారు. చిన్నారి హస్మాబి చేసిన నృత్యం సభికుల కరతాళ ధ్వనులను, మన్ననలను పొందింది. ధ్యాన గురువు బాలకృష్ణ ఫ్యామిలీ క్లబ్ సభ్యులకు ధ్యానం పై అవగాహన కలిగించి ధ్యానం చేయించారు.
క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు, మాలతి దంపతులు క్లబ్ సభ్యులకు అందమైన అద్భుతమైన రజిత జ్ఞాపికలను అందించారు. ఆద్యంతం హుషారైన పాటలతో… ఆటల పోటీలలో బహుమతులు పొంది, పసందైన విందు ఆరగించి మధురస్మృతులను ప్రోధి చేసుకుని సభ్యులు ఇంటి బాట పట్టారు.
సమావేశములో తాళ్లూరి శ్రీనివాసరావు, కె.వి సురేష్, టి పాండురంగారావు, బి కే వి రమేష్, ఎం మధుసూదనరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కోట కిరణ్ కుమార్, టి వెంకటేశ్వర్లు, పి విజయకృష్ణ, కేవీ చంద్రమౌళి, సిహెచ్ రంగసుబ్రహ్మణ్యం, ఎన్ వెంకటేశ్వర గుప్తా.. తదితరులు పాల్గొన్నారు.





