హరిత శోభిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యం గా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సంబంధిత శాఖలు సమన్వయంతో వివిధ వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఈ నెల 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని “వనం – మనం” కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేసించిన నేపధ్యంలో జిల్లాలో ఈ కార్యక్రమం అమలుపై మంగళవారం ప్రకాశం భవనం లో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
డీఎఫ్ఓ (సోషల్ ఫారెస్ట్) రాజశేఖర్ మాట్లాడుతూ 5 వ తేదీన ప్రకాశం జిల్లాలో 4 లక్షల 10 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందన్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలల వ్యవధిలో జిల్లాలో 35 లక్షల 76 వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 36 శాతం అటవీ విస్తీర్ణం వున్నదని, దీనిని 50 శాతానికి పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేసించిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ “ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లి” అనే ఇతివృత్తంతో ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
దీనిపై కలెక్టరు మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్చంద సంస్థల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా “వనం- మనం” కార్యక్రమ వాస్తవ స్ఫూర్తితో వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాల్సి వుంటుందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో వీటిని నాటేలా చూడాలన్నారు. సంబంధిత శాఖలకు నిర్దేసించిన లక్ష్యం మేరకు నాటేలా మొక్కలను సరఫరా చేయాలని హార్టీకల్చర్, అటవీ శాఖల అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, ఉద్యాన అధికారి గోపి చంద్, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ రాఘవరెడ్డి, డ్వామా ఏపీ డి వండర్ మాన్, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల సంస్థ జిఎం శ్రీనివాస రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బిసి సంక్షేమ అధికారి అంజల, డిపిఓ గొట్టిపాటి వెంకట నాయుడు, ఏపీఐసీసీ జోనల్ మేనేజర్ మదన్, జిల్లా ఉప విద్యాధికారి చంద్ర మౌళి, జిల్లా పరిషత్, ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

