చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించడంతో పాటు డ్రైనేజ్ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నగరంలో కోట వీధి, బలరాం కాలనీ, మిలటరీ కాలనీ, దిబ్బల రోడ్డు తదితర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ బాపూజీ కాంప్లెక్స్ ఎదురగా వున్న కోట వీధిని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ వారానికి ఎన్ని రోజులు ఇంటింటి చెత్త సేకరణ జరుగుచున్నది, చెత్త సేకరణకు శానిటేషన్ సిబ్బంది వస్తున్నారా లేదా, తడి చెత్త పొడి చెత్త వేరుచేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లో పారిశుధ్య నిర్వహణ పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒంగోలు నగరంలో పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన శానిటేషన్ సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. రహదారుల్లో మురుగునీరు నిల్వ కుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బలరాం కాలనీ, మిలటరీ కాలనీని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. చెత్త సేకరణ జరుగుచున్నది కాని, మురుగు కాలువల క్లీనింగ్ జరగడం లేదని ఆ ప్రాంత ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రంగా నిర్వహించడంతో పాటు డ్రైనేజ్ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దోమల నివారణ చర్యలు కచ్చితంగా జరగాలని అందుకనుగుణంగా డివిజన్స్ వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అలాగే వర్షా కాలం సీజన్ ప్రారంభమైనందున పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డెంగు, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు ప్రజలు గురికాకుండా ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చేపట్టిన దోమల నివారణ చర్యలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్, శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దిబ్బల రోడ్డు ప్రాంతాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా . వెంకటేశ్వర రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

