త్వరలో ప్రారంభం కానున్న పోలీసు శిక్షణ తరగతుల నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను (డిటిసి ) జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఇతర పోలీసు అధికారులతో కలిసి ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, బ్యారక్‌లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. శిక్షణ కోసం అవసరమైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని, అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం, శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్ మరియు ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే గ్రౌండ్ అభివృద్ధి పనులను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. మైదానం చదునుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రన్నింగ్ ట్రాక్, డ్రిల్ ఏరియా, గార్డెన్ వంటి సదుపాయాలను ప్రణాళికలో చేర్చాలని స్పష్టం చేశారు. నవీన పోలీసు సాంకేతికతలకు అనుగుణంగా శిక్షణా ప్రణాళికలను నవీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు మౌలిక వసతుల ఏర్పాటు, వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రెయినేజ్ ఏర్పాటు, శుభ్రతపై నిరంతర దృష్టి అవసరమని అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు,డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, టంగుటూరి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, ఆర్ఎస్ఐ రవి కుమార్ మరియు సిబ్బంది ఉన్నారు.


