పేదరికం లేని సమాజ ఆవిష్కరణ కోసం పీ – 4 పథకంలో మార్గదర్శకులుగా నిలిచి మీ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, పరిశ్రమలు, గ్రానైట్ సంఘాల ప్రతినిధులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఎరువులు, రసాయనాలు, డైరీ ఫారాల యజమానులతో బుధవారం ప్రకాశం భవనంలో వేరువేరుగా ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పీ – 4 పథకం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రతినిధులకు జడ్పీ సీఈవో చిరంజీవి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం,
సమాజంలో అభివృద్ధిపరంగా పైస్థాయిలో ఉన్న 10 శాతం ప్రజలు, కిందిస్థాయిలో పేదరికంతో బాధపడుతున్న 20% కుటుంబాలకు పలు రకాలుగా చేయూతనిచ్చి పేదరికాన్ని ఆయా కుటుంబాలు అధిగమించేలా చూడడమే ఈ పథకం ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా చేయూత అవసరమైన కుటుంబాలు మన జిల్లాలో 74 వేలకు పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని ‘ బంగారు కుటుంబాలు’గా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే వారిని ‘ మార్గదర్శకులు ‘ అని పేర్కొంటున్నట్లు తెలిపారు. మార్గదర్శకులు ఆర్థిక సహాయమే చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం కాదని, బంగారు కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా వివిధ రకాలుగా ‘ మార్గదర్శకం ‘ చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా అవసరాలను, కుటుంబాలను సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో ఈ వివరాలను
పొందుపరిచినట్లు చెప్పారు. ఈ జాబితాను అందజేస్తామని, పరిశీలించి అవసరమైన, చేయగల సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ జాబితాలో లేని కుటుంబాలకు కూడా సహాయం అవసరం అని గుర్తించి తమకు తెలియజేస్తే వాటిని కూడా ఇందులో చేర్చుతామని తెలిపారు. ప్రభుత్వము అందిస్తున్న
సంక్షేమ పథకాలకు అదనంగా ఇతర సహాయం ఏమైనా బంగారు కుటుంబాలకు అవసరమని గుర్తిస్తే, ఆ దిశగా సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా ముందుకు రావాలని, శక్తి మేరకు ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ‘ బంగారు బాల్యం ‘ కార్యక్రమంలో భాగంగా వల్నరబుల్ ( ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ ) చిన్నారులను గుర్తించేందుకు సర్వే చేశామని ఆమె చెప్పారు. మీ ప్రాంతంలోని ఈ చిన్నారుల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసేందుకు కూడా పాఠశాలల యాజమాన్యాలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. మీ ప్రాంతంలోని పేదలను, మీ వద్ద
పనిచేస్తున్న పేద కార్మిక కుటుంబాలను కూడా ఆదుకునేందుకు సేవా దృక్పథంతో స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాలని పరిశ్రమల యజమానులకు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సహాయం చేసేందుకు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావచ్చు అని చెప్పారు. బంగారు కుటుంబాల్లో అర్హులకు ఆసుపత్రిలో ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర – 2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ యాక్షన్ ప్లానులో పది సూత్రాలను రూపొందించారని కలెక్టర్ తెలిపారు. పేదరిక నిర్మూలన ఇందులో ఒకటి అని చెప్పారు. పీ – 4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలు, ఆశయ సాధనకు అనుగుణంగా సహాయం చేసే శక్తి ఉన్న వారందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సమావేశాలలో జడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, డీ.ఈ.వో. కిరణ్ కుమార్, సీ.పీ.వో. స్వరూప రాణి, గనుల శాఖ డీ.డీ. రాజశేఖర్, జిల్లా పరిశ్రమల
సంస్థ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక
శాఖ అధికారి రవికుమార్, డీ.ఎం.హెచ్.వో. వెంకటేశ్వర్లు, డీ.సీ.హెచ్.ఎస్. శ్రీనివాస నాయక్, ఎన్.టీ.ఆర్. వైద్యసేవ జిల్లా సమన్వయకర్త హేమంత్, ఔషధ నియంత్రణ శాఖ ఏ.డీ. జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఏ.పీ.ఎం.ఐ.పీ. పీ.డీ. శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
క్షయ బాధితులకు సహాయం ….
క్షయ బాధితులకు మంచి పోషకాహారం కోసం 12 మంది గ్రానైట్ పరిశ్రమల యజమానులు రూ.2,60,000 లను విరాళముగా ఇచ్చారు. కలెక్టర్ చేతుల మీదగా జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీవాణికి అందించారు. విరాళము ఇచ్చిన వారికి ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు.

