గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సజావుగా చేపట్టి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
మునిసిపల్ కమీషనర్లను, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సజావుగా చేపట్టి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మునిసిపల్ కమీషనర్లు, పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, మెదడువాపు మొదలైన వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా కేసులు గుర్తించే ప్రక్రియను మెరుగుపరచాలన్నారు. రాపిడ్ టెస్టులలో పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్ టెస్టులు తప్పకుండా చేయాలన్నారు. అన్ని ల్యాబ్‌లలో రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. నీటి గుంటల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, నీటిగుంటల్లో దోమల లార్వాలు వృద్ధి చెందకుండా గంబూషియా, గుప్పి చేపలను వదిలిపెట్టాలన్నారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జనావాసాలు పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలుకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వెక్టర్ నియంత్రణ మరియు పరిశుభ్రత యాప్ నిర్వహణ కచ్చితంగా అమలుచేస్తూ ఏఎన్ఎం లు మరియు శానిటరీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడా కూడా నీరు నిల్వఉండకుండా దోమలు వృద్ధి చెందకుండా ఎక్కడికక్కడ గట్టి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఆ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి నీరు నిల్వ ఉండకుండా గుంతలు లేకుండా బాగు చేసుకోవాలని సూచించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మురికి కాలువలు సజావుగా శుభ్రం చేసేందుకు, అన్ని వసతిగృహాల్లోను క్రమంతప్పక దోమల నివారణ మందులను వినియోగించాలని, మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రమం తప్పక పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మంచి నీటి పైప్ లైన్లు ఎక్కడా కూడా దెబ్బతినకుండా చూసుకోవాలని తద్వారా తాగునీరు కలుషితం కాకుండా గమనించాలన్నారు. ఈ సందర్భంగా శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా మలేరియా అధికారి దోమల నివారణకు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. వెంకటేశ్వర రావు, జిల్లా మలేరియా నిర్మూలన అధికారి డా. మధుసూదనరావు, జడ్పీ సిఇవో చిరంజీవి, ఒంగోలు మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు, ఇరిగేషన్ ఎస్.ఈ వరలక్ష్మి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, ఐసిడిఎస్ పీడీ సువర్ణ, డిఆర్డిఎ పీడీ నారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస రావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలజ్యోతి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వరలక్ష్మి, డిడి మైన్స్ రాజశేఖర్, జిల్లా లోని అన్నీ మునిసిపాలిటీల కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

