పేదరికం లేని సమాజాన్ని రూపొందించటంలో కాంట్రాక్టర్లు కూడా కలిసి రావాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

పేదరికం లేని సమాజాన్ని రూపొందించటంలో కాంట్రాక్టర్లు కూడా కలిసి రావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఇందుకోసం పీ – 4 పథకంలో ‘ మార్గదర్శకులు ‘ గా నిలవాలని కోరారు. రహదారులు – భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్,  పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పనులు చేపట్టే కాంట్రాక్టర్లతో గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
                  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పీ – 4 పథకం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రతినిధులకు జడ్పీ సీఈవో చిరంజీవి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం,
సమాజంలో అభివృద్ధిపరంగా  పైస్థాయిలో ఉన్న 10 శాతం ప్రజలు, కిందిస్థాయిలో పేదరికంతో బాధపడుతున్న 20% కుటుంబాలకు పలు రకాలుగా చేయూతనిచ్చి పేదరికాన్ని ఆయా కుటుంబాలు అధిగమించేలా చూడడమే ఈ పథకం ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా చేయూత అవసరమైన కుటుంబాలు మన జిల్లాలో 74 వేలకు పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని ‘ బంగారు కుటుంబాలు’గా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే వారిని ‘ మార్గదర్శకులు ‘ అని పేర్కొంటున్నట్లు తెలిపారు. మార్గదర్శకులు ఆర్థిక సహాయమే చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం కాదని, బంగారు కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా వివిధ రకాలుగా ‘ మార్గదర్శకం ‘ చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా అవసరాలను, కుటుంబాలను సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో ఈ వివరాలను
పొందుపరిచినట్లు చెప్పారు. ఈ జాబితాను అందజేస్తామని, పరిశీలించి అవసరమైన, చేయగల సహాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ జాబితాలో లేని కుటుంబాలకు కూడా సహాయం అవసరం అని గుర్తించి తమకు తెలియజేస్తే వాటిని కూడా ఇందులో చేర్చుతామని తెలిపారు. ప్రభుత్వము అందిస్తున్న
సంక్షేమ పథకాలకు అదనంగా ఇతర సహాయం ఏమైనా బంగారు కుటుంబాలకు అవసరమని గుర్తిస్తే, ఆ దిశగా సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా ముందుకు రావాలని, శక్తి మేరకు ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు. పేద కుటుంబాల్లోని పిల్లలను చదివించడం, ఆయా కుటుంబాలకు అవసరమైన జీవనోపాధి కల్పనకు శక్తి మేరకు కృషి చేయటం,  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారికి వైద్యం కోసం చేయూతనివ్వటం, అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి లభించాల్సిన సంక్షేమ పథకాల ప్రయోజనం ఆయా కుటుంబాలకు దక్కనప్పుడు ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లి లబ్ది కలిగేలా చూడటం వంటి సహాయం చేయవచ్చని చెప్పారు. బంగారు కుటుంబాలకు ఉన్న ఆర్థికేతర అవసరాలపై అవగాహన కల్పించవచ్చన్నారు.
                స్వర్ణాంధ్ర – 2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ యాక్షన్ ప్లానులో పది సూత్రాలను రూపొందించారని కలెక్టర్ తెలిపారు. పేదరిక నిర్మూలన ఇందులో ఒకటి అని చెప్పారు. పీ – 4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలు, ఆశయ సాధనకు అనుగుణంగా సహాయం చేసే శక్తి ఉన్న వారందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
            ఈ సమావేశాలలో జడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి,
సీ.పీ.వో. స్వరూప రాణి, జిల్లా పశుసంవర్ధక
శాఖ అధికారి రవికుమార్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ.  బాల శంకరరావు, ఇరిగేషన్ ఎస్.ఈ.వరలక్ష్మి, ఆర్ అండ్ బి. ఎస్.ఈ. రవి నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *