ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యకాదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు.
రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయి, పీ4 కార్యక్రమం అమలు, డాక్యుమెంట్స్ అప్ లోడ్, ప్రాజెక్ట్స్ భూ సేకరణ తదితర అంశాలపై వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక పంపిణీ, పేదలకు గృహ నిర్మాణం, విద్యుత్ సరఫరా, తదితర సేవలలో ప్రజలు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరించి ఆయా సేవల పట్ల ప్రజలు సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. విద్యుత్ పంపిణీలో లో ఓల్టేజ్ వంటి ఎటువంటి సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ఉచిత ఇసుక పంపిణీ విధానంలో ప్రజలు ఇబ్బంది కలగని రీతిలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేదల గృహ నిర్మాణంలో వారి సమస్యలు తెలుసుకుని, నిర్మాణ సామాగ్రి, సాంకేతిక సహకారం అందించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు చూడాలన్నారు. ఆగష్టు, 15 వ తేదీ లోపు రాష్ట్రంలో 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్సకులతో అనుసంధానం చేసి, బంగారు కుటుంబాలు అభివృద్ధి దిశగా పయనించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి బంగారు కుటుంబాల అభివృద్ధికి అవసరమైన ‘నీడ్స్ అసెస్మెంట్ సర్వే’ నిర్వహించి, వాటిని మార్గదర్సకులకు తెలియజేసి,బంగారు కుటుంబాలను మార్గదర్శిలతో అనుసందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శికుల గుర్తింపు అనుసంధానంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తామని సిఎస్ కు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవిన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లాపరిషత్ సీఈఓ చిరంజీవి, డి ఎస్ ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

