జిల్లా కలెక్టర్లు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడువర్చువల్ సమావేశం నిర్వహణ – పీ4 కార్యక్రమం పురోగతిపై సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పి 4 కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
శుక్రవారం సాయంత్రం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమై పీ4 కార్యక్రమం పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….పేద కుటుంబాల సాధికారతే ప్రభుత్వం లక్ష్యమన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసివచ్చి పి4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోపు పూర్తిచేయాలి. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని, కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, సంతనూతలపాడు శాసన సభ్యులు బిఎన్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, డిఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, వరకుమార్, సిపిఓ స్వరూప రాణి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, డిఆర్డీఏ, డ్వామా పిడి లు నారాయణ, జోసెఫ్ కుమార్, డిడి మైన్స్ రాజశేఖర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *