హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి శనివారం రాత్రి మార్కాపురం పట్టణ శివారులోని రాయవరం అంబేద్కర్ గురుకుల పాఠశాల(బాలికలు)ను సందర్శించారు. డార్మెటరీ రూములు, టాయిలెట్లు, వంటగదిని వారు తనిఖీ చేశారు. భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా మంత్రి, కలెక్టర్ మాట్లాడారు. నీటి సమస్య ఉందని, శానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని విద్యార్థులు ఈ సందర్భంగా వారి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు. తక్షణమే ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంట సబ్ కలెక్టర్ సహాదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ. అర్జున్ నాయక్, ప్రధానోపాధ్యాయురాలు ఆశాలత, తహసిల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు ఉన్నారు.


