బేగంపేట జూలై 27(జే ఎస్ డి ఎం న్యూస్)
బిసి లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో బిసి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీని అమలు చేయకుండా బిసి లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. పారదర్శకత లేకుండా కులగణన చేపట్టి హడావుడి గా అసెంబ్లీలో బిల్లును చేసి రాష్ట్రపతికి ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిందని, బిల్లును ఆమోదించడం కాదు.చట్టబద్ధత కల్పించాలని తాము ఆనాడే కోరామని తెలిపారు. గత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లు బిల్లులు ఆమోదించి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్ధత వస్తుందని, ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. రోజుకో మాట పూటకో ముచ్చట అన్న ట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక డ్రామాలు ఆడుతూ ఇచ్చిన హామీ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలో బిల్లులు తీసుకొచ్చిన న్యాయస్థానాలు కొట్టేశాయని వివరించారు. ఇప్5ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, బిల్లు తీసుకొచ్చిన అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం చట్టవిరుద్దమని మేధావి వర్గాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి 9 వ షెడ్యూల్ లో చేర్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఎవరైనా కోర్టుకు వెళితే బి ఆర్ ఎస్ పార్టీని బాధ్యులను చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్, నాయకులు భారీ అశోక్ యాదవ్, రమేష్, లింగ స్వామి, అభిలాష్, నరేష్ తదితరులు ఉన్నారు.

