ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై లోతైన అవగాహన, శిక్షణ కోసం కేరళ రాష్ట్రం నుండి వచ్చిన 34 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ప్రకాశం జిల్లాలోఆదివారం పర్యటించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను బృందం సందర్శించారు. రైతులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను ఎంతగానో ప్రశంసించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల నిపుణులు, రైతు మెంటార్ ట్రైనర్లతో కూడిన ఈ బృందం జూలై 26 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.
ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా డీపీఎం సుభాషిణి నేతృత్వంలో కేరళ బృందం ప్రకాశం జిల్లాలోని పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ముందుగా మద్దిపాడు మండలం, దొడ్డవరం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 20 రకాల పంటల వైవిధ్యంతో సాగు చేస్తున్న విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను రైతు ఎలా అనుసరిస్తున్నారో, పంటల ఎంపికలో ఆయన అనుసరించిన పద్ధతి ని బృందం సభ్యులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పంటల వైవిధ్యాన్ని, దాని ద్వారా సాధిస్తున్న విజయాలను బృందం ఎంతగానో మెచ్చుకుంది.
మస్తాన్ వ్యవసాయ నమూనాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆ తర్వాత, కొత్తపట్నం మండలం, పాదర్తి గ్రామంలో రైతు మస్తాన్ సాగు చేస్తున్న ఏ-గ్రేడ్ వేరుశెనగ పంటను కేరళ బృందం పరిశీలించారు. మస్తాన్ అనుసరిస్తున్న అంతర పంటలు, సరిహద్దు పంటల ప్రయోజనాలను బృందం తెలుసుకున్నారు. వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో రైతు వివరించారు. పలు పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సాధ్యమవుతుందని, లాభదాయకమైన విధానాన్ని ప్రతి రైతు పాటించవలసిన అవసరం ఉందని కేరళ బృందం అభిప్రాయ పడ్డారు. రైతు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ మోడల్‌ను చూసిన కేరళ బృందం రైతు ను అభినదించారు. ఆయన ప్రయత్నం ఇతర రైతులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఇక్కడి రైతుల కృషి తమకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని కేరళ బృందం సభ్యులు తెలిపారు. ఈ పర్యటన ద్వారా తాము ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నామని, వీటిని కేరళలోని రైతులకు కూడా తెలియజేసి, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తామని వారు పేర్కొన్నారు.
తదుపరిగా, హార్టికల్చర్ పంటలలో పిఎండిఎస్
విధానాన్ని అనుసరిస్తున్న కొత్తపట్నం మండలానికి చెందిన రైతు కాటా సురేంద్ర పొలాన్ని బృందం సందర్శించింది. ఆయన పొలంలో వానపాముల వృద్ధి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా తీసుకుంటున్న శ్రద్ధను బృందం ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేల జీవవైవిధ్యం నిర్వహణలో ఈ విధానం ఎంతగానో సహకరిస్తుందనే విషయం వారికి అవగాహనగా ఏర్పడిందని తెలిపారు.
తదుపరి, కొత్తపట్నం గ్రామానికి చెందిన మల్లేశ్వరి బయో-రిసోర్స్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఘన జీవామృతం తయారీ ప్రక్రియ, విత్తన శుద్ధి చర్యలపై ప్రాక్టికల్ డెమోను ప్రత్యక్షంగా చూశారు. శిక్షణలో భాగంగా వీటికి సంబంధించిన వివరాలను బృందం లోతుగా గ్రహించారు.
కార్యక్రమంలో కేరళ బృందంతో పాటు రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.వి. రాయుడు , జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి , ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


