నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు -నాసిరకం మద్యంతో భారీ స్కామ్ కు పాల్పడ్డారు -తన స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు -వంద‌ల‌ కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, అభివృద్ధి ప‌నులు – వేల కోట్ల‌తో పేద‌ల‌కు పెన్ష‌న్లు, సంక్షేమ ప‌థ‌కాలు – విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు పెట్టారని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మద్యం విషయంలో జగన్ ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడిందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టి స్వార్థపూరిత రాజకీయాలు చేశారని ఆక్షేపించారు. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌వారం మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాలవీరాంజనేయస్వామిలు ప‌ర్య‌టించారు. ముందుగా రూ.1.33 కోట్ల‌తో కంబంలో, రూ.70 ల‌క్ష‌ల‌తో కందులాపురంలో, రూ.40 ల‌క్ష‌ల‌తో హ‌జ‌ర‌త్ గూడెంలో నిర్మించిన సీసీ రోడ్ల‌ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అనంత‌రం బెస్త‌వారిపేట‌లో రూ.1.83 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఆ త‌రువాత కొమ‌రోలు క‌సిన‌ప‌ల్లిలో రూ.3.60 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ 33\11 కేవీ స‌బ్ స్టేష‌న్ కు స‌హ‌చ‌ర మంత్రి డీబీవీ స్వామితో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం రాచ‌ర్ల మేడంవారి ప‌ల్లెలో రూ.3.90 కోట్ల‌తో నిర్మించిన 33\11 కేవీ విద్యుత్ స‌బ్ స్టేష‌న్ ను మంత్రులిద్ద‌రూ ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ…. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 15 నెల‌ల కాలంలోనే వంద‌ల కోట్ల రూపాయిల‌తో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో వేల కిలోమీట‌ర్ల మేర రోడ్ల మ‌ర‌మ‌త్తుల‌తో పాటు నూత‌న రోడ్ల‌ను నిర్మించినట్లు తెలిపారు. అదే విధంగా పేద‌ల‌ సంక్షేమ‌మే ప్ర‌ధాన ఎజెండాగా పెన్ష‌న్ల‌ను ల‌బ్ధిదారుల‌కు అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రూ.33 వేల కోట్ల‌ను పింఛ‌న్ల పంపిణీ కోస‌మే వెచ్చిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా రూ.10వేల కోట్ల‌ను త‌ల్లికి వంద‌నం ద్వారా త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సరే ఆగస్టు 1 నాడు ల‌క్ష‌కు పైగా స్పౌజ్ పెన్ష‌న్లను అందించామని తెలిపారు. అదే విధంగా య‌ర్ర‌గొండ‌పాలెంలో రూ.66 కోట్ల‌తో 220 కేవీ స‌బ్ స్టేష‌న్ ను నిర్మిస్తున్నామ‌ని చెప్పారు.

వైసీపీ నేత‌లు క‌ళ్లున్నా చూడ‌లేని బుద్ధి హీనులు…

సీఎం చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తుంద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇచ్చిన హామీల‌న్నీ ఒక్క‌క్క‌టిగా అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. మార్కాపురాన్ని ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వంలో గుండ్ల‌క‌మ్మ గేట్ల‌ను విర‌గొట్టి ఇసుక అక్ర‌మ ర‌వాణా చేశార‌ని, కూట‌మి ఏర్ప‌డిన త‌రువాత గుండ్ల‌క‌మ్మ‌కు గేట్లు బిగించి రైతుల‌కు నీటిని ఇవ్వ‌డ‌మే కాకుండా చేప పిల్ల‌ల‌ను వ‌ద‌ల‌డం ద్వారా చేప‌లు ప‌ట్టే వారికి జీవ‌నోపాధి క‌ల్పించామ‌ని వెల్ల‌డించారు. అదే విధంగా గుండ్ల‌క‌మ్మ‌, వెలిగొండ ప్రాజెక్టుల‌ను కూడా పూర్తి చేస్తామ‌ని తెలిపారు. చెప్పిన విధంగా రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని అమ‌లు చేశామ‌న్నారు. ఆగ‌స్ట్ 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్ ప‌థ‌కాన్నీ అందుబాటులోకి తెస్తున్నామ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. నేత‌న్న‌ల చేతి మ‌గ్గాల‌కు 200 యూనిట్లు, మ‌ర మ‌గ్గాల‌కు 500 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తున్నామ‌ని తెలిపారు. నేత‌న్న‌ల ఉచిత విద్యుత్ ప‌థ‌కం కోసం కూట‌మి ప్ర‌భుత్వం రూ.125 కోట్లు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న వైసీపీ నేత‌లు కళ్లున్నా చూడ‌లేని బుద్ధి హీనుల‌ని విమ‌ర్శించారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, కందుల నారాయ‌ణ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్రన‌ర‌సింహా రెడ్డి, య‌ర్ర‌గొండ‌పాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్ష‌న్ బాబు, ప‌లువురు కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *