స్వాతంత్ర్యదిన వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

79వ స్వాతంత్ర్యదిన వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై సోమవారం ఆమె అన్ని శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అతిథులకు ఆహ్వానం, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం, ప్రభుత్వ పథకాలు తెలియజేసేలా శకటాలు, ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు, ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిని వీక్షించేందుకు విద్యార్థులను తరలించడంపై ఇప్పటినుంచే సంబంధిత శాఖలు దృష్టిసారించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. శకటాలపై పథకాలకు సంబంధించిన వివరాలను సమగ్రంగా ముద్రించాలని, ఆయా శాఖల ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. వేడుకల రోజున ఉదయం 8:30 గంటలకల్లా విద్యార్థులను పూర్తిస్థాయిలో పరేడ్ గ్రౌండ్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం కాబట్టి ఫోటోలను ముద్రించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు అన్నారు. ఈనెల 10వ తేదీ నాటికి ప్రశంసా పత్రాల కోసం ప్రతిపాదనలను పంపించాలని స్పష్టం చేశారు. పీ – 4 పథకములో మార్గదర్శకులను చురుకుగా గుర్తించిన వారిని, స్వతహాగా మార్గదర్శకులుగా మారిన అధికారులను ప్రశంసా పత్రాలు పొందేందుకు అత్యధిక అర్హులుగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు. జాతీయ పతాకానికి ఎలాంటి అవమానం జరగకుండా స్వాతంత్ర్య దిన వేడుకల నిర్వహణ చేపట్టేలా అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె చెప్పారు. విద్యార్థులలోనూ, ప్రజలలోనూ స్వాతంత్ర్య పోరాట గొప్పదనాన్ని, విలువలను తెలిపేలా ” హర్ ఘర్ తిరంగా ” పేరుతో ప్రతిరోజు వివిధ స్థాయిలలో కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఆర్ . గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి. చిన ఓబులేసు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *