చేనేత ఉత్పత్తులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ

చేనేత ఉత్పత్తులను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ
అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చేనేత కార్మికులతో కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమంలో చేనేత ఉత్పత్తులు కూడా కీలక పాత్ర పోషించాయన్నారు. కాలపరీక్షను ఎదుర్కొని నిలబడిన చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. చారిత్రక విశిష్టత కలిగిన చేనేత తరంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్తు, జీఎస్టీ రాయితీతోపాటు చేనేతకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత సొసైటీలకు ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా చేనేత ఉత్పత్తులను సొసైటీలు విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. మరో స్వాతంత్ర్య ఉద్యమంలాగా చేనేత ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఎల్.డి. ఎం. రమేష్ మాట్లాడుతూ చేనేతకారులకు ముద్ర రుణాలు త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. చేనేత,  జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రఘునందన్ మాట్లాడుతూ జిల్లాలో 50 ఏళ్లు పైబడిన 1762 మంది చేనేత కార్మికులు నెలకు రూ.4వేలు చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కానుక పొందుతున్నట్లు చెప్పారు. ముద్ర పథకం కింద బ్యాంకు రుణాల కోసం 2024 – 25 సంవత్సరంలో 217 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 27 దరఖాస్తుదారులకు రూ.26 లక్షల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. సమగ్ర చేనేత క్లస్టర్ డెవలప్మెంట్ పథకం కింద ఒక్కొక్కటి  రూ.1.20 లక్షల విలువైన వ్యక్తిగత వర్క్ షెడ్లను జిల్లాలో 20 మందికి మంజూరు చేసినట్లు వివరించారు. చేనేతకారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులైన 659 మంది పేర్లును  రాష్ట్ర కార్యాలయానికి పంపించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏడుగురు చేనేతకారులను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. చేనేత వస్త్రాల ప్రదర్శనను తిలకించారు.
ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వి.భీమయ్య, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టి. వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనికి ముందుగా ప్రకాశం భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని డిఆర్ఓ బి.చిన ఓబులేసు ప్రారంభించారు. చేనేత రంగ విశిష్టతను ఆయన కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *