హైదరాబాద్ ఆగస్టు 28 (జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరం లోని ఖైరతాబాద్ బడా గణేష్ ను హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ సందర్శించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సి పి మాట్లాడుతూ, హైదరాబాద్ కమిషనర్ గా గణేష్ విగ్రహము ప్రతిష్టించిన రెండవ రోజునే ఖైరతాబాద్ గణేష్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తాను దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలందరితో తనకు పరిచయం ఉందన్నారు.తాను డీసీపీ సెంట్రల్ జోన్,అడిషినల్ సిపి ట్రాఫిక్ గా మరియు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ఇప్పటివరకు 11 సార్లు గణేష్ నిమజ్జన బందోబస్తులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 6, 2025న గణేష్ విగ్రహాల నిమజ్జనానికి హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసామన్నారు.ఉత్సవాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.దాదాపు 11,000 దరఖాస్తులలో, 10,900 గణేష్ మండపాలకు ఆన్లైన్లో అనుమతులు చేశామని. హైదరాబాద్ నగరంలో మిగిలిన సుమారు 15,000 విగ్రహాలను కూడా రికార్డుల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల బందోబస్తు చర్యలు చేపట్టడం సులభమవుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం హైదరాబాద్ పోలీస్ విభాగాల నుండి దాదాపు 19,000 మంది పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. బయటి జిల్లాల నుండి అదనంగా 8,500 మంది పోలీసులు, 42 ప్లాటూన్లు, 10 సీఏపీఎఫ్ కంపెనీలు, మరియు ఆక్టోపస్ బృందాలు వస్తున్నాయి. మొత్తం సుమారు 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు.నిమజ్జన ఊరేగింపులను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్లతోపర్యవేక్షించనున్నామన్నారు.ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్నందున, మండప నిర్వాహకులు కరెంటు విషయంలో చాలా జాగ్రత్త వహించాలని కోరారు. ఉచిత విద్యుత్తు ఇస్తున్నప్పటికీ, నిర్వాహకులు స్థానిక విద్యుత్తు శాఖాధికారులను సంప్రదించి సరైన పద్ధతిలో కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. వర్షానికి తడిసిన కట్టెలు కూడా విద్యుత్తు వాహకాలుగా మారే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మండప నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యగా వాలంటీర్లను నియమించుకోవాలని, వారు తప్పనిసరిగా బారికేడింగ్‌ను పర్యవేక్షించాలని సూచించారు. రాత్రిపూట కనీసం 2 లేక 3 వాలంటీర్లు మండపం వద్ద ఉండాలని తెలిపారు.
ముఖ్యమైన ప్రాంతాలైన ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ఉమ్మడి నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశామని. చివరి నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 6న) బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీ వద్ద 24 గంటలూ పనిచేసే విధంగా ఉమ్మడి నియంత్రణ కేంద్రం ఉంటుందని తెలిపారు.హుస్సేన్ సాగర్, మీరాలం ట్యాంక్, రాజన్న భావి, ఎన్టీఆర్ స్టేడియం వంటి ప్రాంతాలలో ప్రస్తుతం 9 క్రేన్లను ఏర్పాటు చేశాము,జిహెచ్ ఎంసి, ఆర్ ఆండ్ బి మరియు ఇతర శాఖల సమన్యముతో చివరి రోజు వరకు ఈ సంఖ్యను 40 కి పెంచుతామని తెలిపారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వారు నిమజ్జనానికి ఒక రోజు ముందు నుండే ఏర్పాట్లు చేస్తామని, ఆ రోజు మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని రోజువారీగా 60 నుండి 70 వేల మంది సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరపు బోనాలు మరియు ఇతర పండుగలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నందున, ఖైరతాబాద్ గణేష్ ను సందర్శించడానికి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, కావున ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వారాంతాల్లో లక్ష నుండి రెండు లక్షల మంది భక్తులు వస్తున్నందున, ఎక్కువ మంది పోలీసులను నియమించి, గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు, భక్తులు మరియు ఉత్సవ సమితి సభ్యులు పోలీసులతో సహకరించాలని కోరారు. రాబోయే పది రోజులు వర్షాలు ఉన్నందున, బందోబస్తు విధుల్లో ఉన్న తమ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
తరువాత సి.వి. ఆనంద్ ఇతర అధికారులు కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపానికి వెళ్లే దారులను, బారికేడింగ్ వ్యవస్థను పరిశీలించారు. గణేష్ విగ్రహాలు మూడవ రోజు నుండి నిమజ్జనానికి వస్తాయి కాబట్టి, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మరియు ఇతర నిమజ్జన పాయింట్లను కూడా పరిశీలించారు.
శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించడానికి ప్రజల సహకారం కోరుతున్నామని సి.వి. ఆనంద్ కోరారు.
ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ ,డి. జోయల్ డెవిస్ అపూర్వా రావు , శిల్పావల్లి ఐపీఎస్ (డీసీపీ సెంట్రల్ జోన్) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.



