వినాయక చవితి ఉత్సవాల అనంతరం జరిగే విగ్రహా నిమజ్జనాల దృష్ట్యా జిల్లాలో నిమజ్జనాలు అధికంగా జరిగే కొత్తపట్నం తీర ప్రాంతాలను శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులతో కలిసి సందర్శించి, నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్య నిమజ్జనల వద్ద డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచటం, భద్రతా దళాలు, స్పెషల్ బృందాలు కూడా విధుల్లో భాగంగా పాల్గొన్నాయి. తీరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సజావుగా, భద్రతతో జరిగేందుకు అవసరమైన జాగ్రత్తలు, ప్రత్యేక ఏర్పాట్లపై పోలీసులు అధికారులకు పలు సూచనలు అందజేశారు.విగ్రహాల నిమజ్జనాల్లో ఎలాంటి అపశ్రుతులు లేదా అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు సంభవించకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు జరగేలా చూడాలని, ట్రాఫిక్‌ను సమర్ధవంతంగా నియంత్రించాలని, భక్తులు ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా, చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు వంటి అవసరమైన భద్రతా సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గజఈతగాళ్లకు ప్రత్యేక టీషర్టులు అందజేయడం ద్వారా వారు తేలికగా గుర్తించబడేలా చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ గారు తెలిపారు. భద్రత చర్యల్లో భాగంగా మెరైన్ పోలీసులు కూడా సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ… వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కోసం పోలీసు శాఖ తరఫున అన్ని భద్రతా మరియు బందోబస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, పటిష్ట భద్రతా ఏర్పాట్లతో జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, పోలీసులు మరియు మెరైన్ పోలీసులు కలసి విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లను నియమించి, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచామని వివరించారు. గ్రామంలో వృద్ధులు, చిన్నపిల్లలు, మరియు అనారోగ్యంతో బాధపడుతున్నవారిని దృష్టిలో ఉంచుకొని, డీజే సౌండ్ మరియు మైకులను గ్రామంలో ఉపయోగించకుండా గ్రామం బయటే ఆపుకుని, అక్కణ్ణుంచి నిమజ్జనానికి బయలుదేరాలి. భక్తులు పోలీసులకు సహకరిస్తూ, సూచనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలన్నారు. నిమజ్జన కార్యక్రమాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు ప్రతిష్టించిన విగ్రహాలను కాలువలు, చెరువులు, నదుల వంటి నిమజ్జన ప్రదేశాల్లో ముందుగానే గుర్తించామని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ అధికారులు కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్, వెంకట కృష్ణయ్య, మెరైన్ ఎస్సై సుబ్బారావు మరియు సిబ్బంది ఉన్నారు.

