రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయంలోని పీఎండీఎస్, కాంపాక్ట్ బ్లాక్స్, ఏ-గ్రేడ్, ఏటీఎం మోడల్స్ వంటి ఉత్తమ నమూనాలను ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ-అరిడ్ ట్రాపిక్స్ ( ఐక్రిసాట్), ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ( టెరి ) నిపుణులు శుక్రవారం జిల్లాలో పర్యటించి పరిశీలించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిని ఆధ్వర్యంలో పర్యటన నిర్వహించారు.
ఐక్రిసాట్ ఆసియా, ఆఫ్రికాలోని సెమీ-ఎరిడ్ ప్రాంతాల్లో ఆకలి, పేదరికం, పర్యావరణ క్షీణతను తగ్గించేందుకు డ్రైల్యాండ్ వ్యవసాయం మరియు ఆహార వ్యవస్థలను మెరుగుపరచడంపై దృష్టి సారించే అంతర్జాతీయ సంస్థ ,టెరి స్వతంత్ర, లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ. ఇది ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పు మరియు సుస్థిర అభివృద్ధి రంగాల్లో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది.
మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన రైతు సిహెచ్. రామాంజనేయులు రెండున్నర ఎకరాల్లో సాగుచేస్తున్న 20 రకాల పంటల వైవిధ్యతను పరిశీలించారు. అనంతరం చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామానికి చెందిన పి .రామాంజనేయులు అమలు చేస్తున్న ఏ-గ్రేడ్ మోడల్ కంది పంటను పరిశీలించారు.
తరువాత సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రైతు సిహెచ్. మీనమ్మ 1.5 ఎకరాల్లో అమలు చేస్తున్న పీఎండీఎస్ నిమ్మ తోటను బృందం సందర్శించారు.
కొత్తపట్నం మండలానికి చెందిన రైతు పిట్టు వెంకటేశ్వర్ రెడ్డి ఒక ఎకరాలో అమలు చేస్తున్న ఏ-గ్రేడ్ మోడల్ పొలాన్ని పరిశీలించారు. ఆయన వేరుశనగతో పాటు అంతరపంటలు సాగు చేస్తూ, అంతరపంటల వలన కలిగే ప్రయోజనాలు, ఆదాయాలను నిపుణులకు వివరించారు.
కొత్తపట్నం గ్రామంలో మల్లేశ్వరి నడుపుతున్న ప్రకృతి వనరుల కేంద్రం (బయో రిసోర్స్ సెంటర్) ను కూడా నిపుణులు సందర్శించారు. అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్ విభాగం గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం చూపుతున్న శ్రద్ధ, సేవలను వారు అభినందించారు.
ఈ పర్యటనలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ సుభాషిణి, ఐక్రిసాట్
బృందం లీడ్ డాక్టర్. హరి, కే. సుధీని, టెరి
బృందం లీడ్ డాక్టర్.హరిందు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


