మాతృభాష అయిన తెలుగు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ
పిలుపునిచ్చారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టరుతో పాటు డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియచెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని కొనియాడారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. అధికారిక కార్యక్రమాలలోనూ, ఉత్తర ప్రత్యుత్తరాలలోనూ తెలుగు భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని ఆయన పిలుపునిచ్చారు. తాను సివిల్స్ పరీక్షలు సైతం తెలుగులోనే రాసిన విషయాన్ని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

