జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. రైతులను భయానికి గురి చేసేలా వ్యాపారులు ఎవరైనా ప్రవర్తించినా, అక్రమంగా యూరియాను నిల్వ చేసినా, పక్కదారి పట్టించినా పీ.డీ. యాక్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆమె ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయనిర్మల, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని, ప్రస్తుతం 70 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, ఈ నెలాఖరుకు మరో 1,80,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. యూరియాకు కొరత లేదని, వీటిని ప్రణాళికాబద్ధంగా రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. అనంతరం మార్కాపురం సబ్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబరు నెలకు 4273 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 5155 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు సరఫరా చేసిందన్నారు. ఇందులో 70 శాతం మార్క్ఫెడ్ ద్వారా, 30 శాతం ప్రైవేట్ డీలర్స్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ( ఆర్.ఎస్.కే ) వారీగా సాగైన విస్తీర్ణం, యూరియా అవసరం, ప్రస్తుత నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి తెలియజేయాలని ఆమె చెప్పారు. ఈ విషయంలో మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ – పంట, ల్యాండ్ రికార్డ్స్, రైతుల ఆధార్ కార్డు వివరాల ఆధారంగా యూరియాను పంపిణీ చేయాలని చెప్పారు. ఏదైనా ఆర్.ఎస్.కె.లో అవసరం కన్నా తక్కువ నిల్వలు ఉంటే సమీపంలోని ఆర్.ఎస్. కె. నుంచి తక్షణమే తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్.ఎస్.కే., ప్రైవేటు షాపుల వద్ద పంపిణీ చేసే సమయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వోలతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం పంపిణీ ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యాత్మక పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్న ప్రాంతంలో పోలీసులను కూడా
పెట్టాలని ఆమె చెప్పారు. ప్రైవేటు డీలర్లతో జిల్లాస్థాయిలో తాను కూడా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. యూరియా అందటంలో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేలా కలెక్టర్ కార్యాలయంలో 83310 57078 నంబరుతో ప్రత్యేక కాల్ సెంటరును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
