సమాజానికి దిశా నిర్దేశం చేసేది గురువులేనని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జిల్లా విద్యాధికారి ఏ.కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి గురుపూజోత్సవములో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర అతిథులుగా పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ బి.చిన ఓబులేసులతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి వారు పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ….. ఉన్నత విలువలు కలిగిన భావిపౌరులను తయారు చేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. ఉపాధ్యాయునిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పని చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ… సమాజ గతిని మార్చేందుకు విద్యే సరైన ఆయుధమన్నారు. గొప్ప మేధావిగా అంబేద్కర్ ఎదగడంలోనూ, గొప్ప పోరాట యోధునిగా అలెగ్జాండర్ నిలవడంలోనూ వారి గురువుల పాత్ర ఎంతో ఉందన్నారు. తన తండ్రి బి.ఎన్. దానం కూడా లెక్చరర్ గా పనిచేశారని ఆయన చెప్పారు. మేయర్ మాట్లాడుతూ విద్యార్థులకు గురువు మాటే వేదవాక్కు అని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి నుంచే తాను వచ్చానని, తనలో స్ఫూర్తి నింపేలా ఇప్పటికీ తన చాంబరులో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో ఉందన్నారు. విద్యార్థులకు మంచి భోజనము, పుస్తకాలు, యూనిఫారంలను ప్రభుత్వం అందిస్తున్నదని, మంచి బోధనపై ఉపాధ్యాయులు కూడా మరింత దృష్టి సారించాలని ఆమె సూచించారు. దామచర్ల సత్య మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి వికాసం వెనుక గురువు ఉంటారని అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్లో రూ.30 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని చెప్పారు. డిఆర్ఓ మాట్లాడుతూ …నవోదయ పాఠశాలలో తాను కూడా ఉపాధ్యాయునిగా పనిచేశానని చెప్పారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నతి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందన్నారు. ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులను గౌరవించుకోవడం ఎంతో సంతోషకరం అన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 53 మంది ఉపాధ్యాయులను అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.





