తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్రపటానికి ఎంఈఓ- 2 సుధాకర్ రావు, కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఈఓ-2 సుధాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చటంతో ఉపాధ్యాయుల కృషి అమోఘమని అన్నారు. చిన నాటి నుండి తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. నిత్యం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయటమే ఉపాధ్యాయుల పాత్ర అని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని వారిపై చెడగొట్టే ప్రేమకన్నా బాగు పరచే కఠినత్వమే మేలని అన్నారు. కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవటంమే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందదాయకమని, అదే వారికి నిజమైన కానుక అని అన్నారు. సర్వేపల్లి రాధా క్రిష్ణన్ విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడిన విధానం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శ ప్రాయమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడే ప్రతి ఉపాధ్యాయుడికి ప్రత్యేకృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యతను చెప్పారు. చదువులంటే కేవలం పుస్తకాలలో పాఠ్యాంశాలను చెప్పటం కాదని, సమాజంలోని మంచి చెడులను విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యతను వివరించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాల్సిన అవసరాన్ని వివరించారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ విద్యార్థుల మేలు కోరే వారు ఉపాధ్యాయులని, కష్టపడి చదివే విద్యార్థికి ఒక మార్కు ఎక్కువ వెయ్యాలని ఉపాధ్యాయుడు చూస్తాడని ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ఉపాధ్యాయులు చూడరని అన్నారు. ఉన్నత స్థితికి వెళ్లినా సరే తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మరువ కూడదని అన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయుల దీవేనలు అందుకున్నారు. ముందుగా ఎంఈఓ-2 సుధాకర్ రావులకు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్ర పటానికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎస్.ఏ)లు సుబ్బయ్య, యలమంద రావు, చిన్నయ్య, వెంకటరావు, స్వరూపరాణి,సుష్మిత, విక్రమ్, మౌళాలి తదితరులు పాల్గొన్నారు.





