ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం
“ సండే ఆన్ సైకిల్” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్ని సైకిల్ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఏ ఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో వాహనాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల వ్యాయామం తగ్గిపోతోందని, దాని ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. రోజుకు కొంత సమయం సైక్లింగ్ చేస్తే, అది శారీరకంగా, మానసికంగా మనల్ని బలంగా ఉంచడమే కాకుండా, భవిష్యత్ తరాల కోసం మంచి వాతావరణాన్ని అందించడంలో కూడా సహకరిస్తుందని తెలిపారు.
ప్రత్యేకించి పోలీస్ సిబ్బంది విధుల ఒత్తిడి వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, వ్యాయామం ద్వారా శక్తి, స్థైర్యం పెరిగి ప్రజలకు మరింత సమర్థంగా సేవలందించగలమన్నారు. ప్రతి ఒక్కరినీ ఫిట్ ఇండియా లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వాములుగా మారి, ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు.
అనంతరం మానసిక ఉల్లాసం కోసం వ్యాయామ సాధనలో భాగంగా నృత్య సాధన చేశారు. శరీరానికి రోజు వారీ ఒత్తిడి అధిగమించేందుకు ప్రతి రోజూ నృత్య వ్యాయామం చేయడం ఎంతో అవసరమని, దీనితో శరీరంలోని అన్ని భాగాలు పూర్తి కదలికలతో సదా చురుకుగా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు , ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, సురేష్, ఆర్ ఎస్సైలు ప్రసాద్, రవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

