రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీ పై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ…. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల్లో ప్రతి సంవత్సరం 15 శాతం వృద్ది రేటు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో రైతులకు మంచి జరగేలా, పెట్టుబడి తగ్గించి, దిగుబడి పెంచేలా రైతులకు మంచి ఆదాయం రావాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రంలో అన్నీ ఆర్.ఎస్.కె ద్వారా రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో యూరియా కొరత ఉందని అపోహతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రైతులను చైతన్యపరిచే ఔట్రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించడం జరిగిందన్నారు. 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు 10 తేదీన మండల స్థాయిలో ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. క్షేత్ర స్థాయిలో ప్రతి రైతుకు సాగు అనుభవాలు ఉన్నప్పటికినీ, మారుతున్న కాలానుగుణంగా 25 శాతం మేర ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి నానో యూరియా, జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. భూ సార పరీక్షల ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు మెలుకవలు పాటిస్తూ ఎంత అవసరమో అంత ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తూ సాగు చేసినట్లయితే పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరిగి రైతుకు మంచి ఆదాయం కలుగుతుందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని డ్రోన్ల సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెచ్చి వినియోగం పెంచనున్నామని అన్నారు. డ్రోన్ వినియోగం, నానో యూరియా, డి ఏ పి పిచికారి విధానాన్ని, రైతులకు ఎంతమేర ప్రయోజనంగా ఉంటుంది అన్న విషయాలను క్షేత్ర్త స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడం జరుగుచున్నదన్నారు. వ్యవసాయం సులభతరం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. రైతులు సాంకేతికను అందిపుచ్చుకొని వ్యవసాయం లాభసాటిగా మారాలని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి, సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. దీంతో భూమి సారవంతంగా మారుతుందని , పంటల నాణ్యతతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా మంచిదని కలెక్టర్ వివరించారు. వరి పంట నుండి ఇతర పంటలకు ప్రాధాన్యత ను ఇచ్చి పంటలను వేసుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను తప్పక పాటించాలని అన్నారు. ఏ పంటకు ఎంత మోతాదు యూరియాను వాడవాల్సివుందో అంతే యూరియాను వాడాలన్నారు. ఎక్కువ యూరియా వాడకం వల్ల పంట, భూసారం తగ్గిపోతుందన్నారు.
జిల్లా లో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో ఎటువంటి సమస్య లేదని, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్, రైతులకు తెలిపారు. ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జిల్లాలోని రైతులకు కావలసినంత యూరియా తెప్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రైతులకు సూచించారు. జిల్లాలో యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు యూరియా పంపిణీకి సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ సంబంధిత తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 8331057078 ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చునని కలెక్టర్ చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ , దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి రమేష్ తదితరులు ప్రసంగిస్తూ … వ్యవసాయ సాగులో చేపట్టాల్సిన సస్య రక్షణ మేలుకవలు, సూచనలను వివరించారు.
ఈ కార్యక్రమంలో దర్శి నియోజక వర్గ ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వర రావు, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

