పిల్లలకు మెరుగైన విద్యతోపాటు వారి ఆరోగ్యంపైనా సమాన దృష్టి పెట్టాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

 పిల్లలకు మెరుగైన విద్యతోపాటు వారి ఆరోగ్యంపైనా సమాన దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల మరియు జూనియర్ కళాశాలల స్థితిగతులు, విద్యాసంబంధ విషయాలపై మంగళవారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా ఆయన సమీక్షించారు. విద్య, వైద్యం, ప్రజలకు తాగునీరు తన ప్రాధాన్యత అంశాలని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం రెగ్యులర్ విధులకే పరిమితం కాకుండా, స్థానికంగా ఉన్న ఆయా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వాటిని పరిష్కరించి మెరుగైన ఫలితాలు రాబట్టేలా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా, జిల్లాలో వివిధ కేటగిరీల వారీగా ఉన్న పాఠశాలలు, కళాశాల వివరాలను డీఈవో ఏ. కిరణ్ కుమార్, ఆర్.ఐ.ఓ. ఆంజనేయులు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. పైతరగతులకు విద్యార్థులు ప్రమోట్ అవుతున్న / చేరుతున్న తీరును, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్టులు, తల్లికి వందనం పథకాలు, విద్యాహక్కు చట్టం అమలవుతున్న తీరును వారు తెలియజేశారు. 
          దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆరోగ్య పరిస్థితిని,  ముఖ్యంగా బాలికలు ఏ విధంగా మెరుగుపరచుకోవాలో టీచర్ల చేత ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యాపరంగా వెనకబడిన పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి గ్రేడ్ మెరుగుపడేలా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ప్రవర్తించాల్సిన తీరు - నేరాలకు పాల్పడితే చట్టపరంగా ఎదుర్కోవాల్సిన చర్యల పైనా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ దిశగా వారు చర్చించుకునేలాగా, తాము ఎదుర్కొన్న పరిస్థితులను పంచుకునేలా విద్యార్థులతో ప్రత్యేకముగా ఆయా విద్యా సంస్థలలో అంతర్గత చర్చా వేదికలను నిర్వహించాలన్నారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. 
           ఈ సమావేశంలో డిప్యూటీ విద్యాధికారులు, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ బాబు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు, పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *