ఫిర్యాదీదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ/ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు మరియు ఇతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించారు. వారి యొక్క సమస్యలను విని సానుకూలంగా స్పందించి చట్టపరంగా త్వరితగతిన న్యాయం అందిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు.
సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని సిబ్బందికి తెలియజేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, పామూరు సీఐ బీమానాయక్, కంభం సీఐ మల్లికార్జున ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
