కొండపి నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధంర్బంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతన వాటర్ ట్యాంక్ ల నిర్మాణం, శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణాలపై మంత్రి చర్చించారు. నియోజకవర్గానికి మంజూరైన 66 శానిటరీ కాంప్లెక్స్ యూనిట్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. టంగూటురులో పీఎం జే జె ఎం కింద రూ.45 లక్షలతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం , జడ్పీ నిధులు రూ. 25 లక్షలతో పొన్నలూరు రావులకొల్లు ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం వెంటనే మెదలుపెట్టాలన్నారు. నియోజవర్గంలోని 6 మండలాల్లో ఎక్కడ నీటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అందుబాటులో ఉంటూ ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
