హౌసింగ్ స్కీములో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అధికారులను ఆదేశించారు. హౌసింగ్ స్కీము పై బుధవారం అధికారులతో ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. పిఎంఏవై ( అర్బన్ – రూరల్ ), పి.ఎం. జన్ మన్ పథకాల క్రింద జిల్లాలో మంజూరైన ఇళ్ళు, నిర్మాణం పూర్తి, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కానివి, స్థానిక పరిస్థితులపై నియోజకవర్గాల వారీగా
కలెక్టర్ ఆరా తీశారు. హౌసింగ్ పీడీ పి. శ్రీనివాస ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వివరాలను వివరించారు. పూర్తయిన నిర్మాణ దశలను బట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేస్తున్నందున లబ్ధిదారులందరూ త్వరగా పూర్తి చేసుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. దీపావళి నాటికి మూడు లక్షల ఇళ్లు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టగా, ప్రకాశం జిల్లాకు 8839 టార్గెట్ ఇచ్చినట్లు పీ.డీ. తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, హౌసింగ్ స్కీములో ఆప్షన్ – 3 క్రింద లబ్ధిదారులుగా ఉన్నవారికి కూడా కాంట్రాక్టర్లు త్వరగా ఇళ్లు నిర్మించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ చెప్పారు. స్పష్టమైన పురోగతి లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ ఈ.ఈ.లు, డి.ఈ.ఈ.లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
