చట్టవ్యతిరేక, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలసి గురువారం ఒంగోలు టౌన్ లోని 9 స్పా సెంటర్లపై సిఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది 9 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలో స్పా సెంటర్ల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులు, అనుమతులు, ఉద్యోగుల వివరాలను పూర్తిగా పరిశీలించారు. స్పా సెంటర్లలోని సీసీ కెమెరాల పనితీరు, అంతర్గత నిర్మాణ శైలి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, అసాంఘిక మరియు అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రకాశం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు.
ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈ తనిఖీలో ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు,ఒంగోలు సబ్ డివిజన్ ఎస్సైలు నాగమలేశ్వరావు, సుధాకర్, పున్నారావు, అజయ్ బాబు, వెంకట్ సైదులు, నాగేంద్ర కుమార్, ఫణిభూషణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

