ప్రకాశం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి , జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తో కలిసి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమీక్ష సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజి జిల్లాలో ప్రస్తుత నేర పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, పలు సూచనలు చేశారు. ప్రాపర్టీ, రౌడీ ఎలిమెంట్స్, గంజాయి, మిస్సింగ్ కేసులు, పోక్సో, మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాడీలి మరియు ఆర్ధిక నేరాలలో టాప్ 10 ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
రాత్రి, పగలు డ్రోన్ పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత వివరించి వాటి ఏర్పాటు కోసం ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌కి ప్రాధాన్యతనిస్తూ, అధికారులు గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గాంబ్లింగ్ వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికలపై ఇష్టానుసారం పోస్టులు పెడుతున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయం వంటి కార్యక్రమాలు నిర్వహించే వారు ప్రభుత్వ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాలు అధికంగా జరిగే సమయాలు, ప్రాంతాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని, ఎన్‌ఫోర్స్మెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఓవర్‌లోడింగ్, రాంగ్‌రూట్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలు, విద్యార్థులలో పోక్సో, గంజాయి మరియు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఐజి సూచించారు.
జిల్లా ఎస్పీ జిల్లాలో అమలు చేస్తున్న ప్రణాళికలు, ముందస్తు చర్యలు, గ్రామ ప్రొఫైల్, క్రైమ్ డిటెక్షన్ చర్యలు మరియు ఇతర అంశాలను ఐజి కి వివరించారు. ఐజి జిల్లా ఎస్పీ పనితీరును అభినందించారు.
ఈ సమావేశంలో ఒంగోలు డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, సిఐలు పాల్గొన్నారు.
