సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేషు అన్నారు.
సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులో ర్యాలీ, సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేషు ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేషు మాట్లాడుతూ… సమాచర హక్కు చట్టం అమలులోనికి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ, సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు అడిగిన సమాచారాన్ని అధికారులు అందించాలన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందవచ్చునని తెలిపారు.
ప్రజల సౌకర్యార్దం విజయవాడలోని ప్రధాన సమాచార కార్యాలయం వారు వర్చువల్ కూడా విచారణలు నిర్వహిస్తున్నారని ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డిఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

