రైలు భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ మరియు వివిధ శాఖలకు చెందిన ప్రధాన విభాగాధిపతులతో కలిసి జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు మరియు నాందేడ్ డివిజన్ల మొత్తం ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ భద్రతా సమీక్ష సమావేశంలో ప్రయాణీకుల మరియు రైలు నిర్వహణలో భద్రతను నిర్ధారించడానికి ట్రాక్‌ల నుండి తీసిన వ్యర్ధ సామగ్రిని సకాలంలో తొలగించడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టిసారించారు. స్టేషన్లలో హింగ్డ్ స్కాచ్ బ్లాక్‌ల ట్రయల్ అమలును ఆయన సమీక్షించారు మరియు విద్యుదాఘాత సంఘటనలను నివారించడానికి ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ (టి.ఆర్.డి) సిబ్బంది భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెప్పారు. తరువాత జనరల్ మేనేజర్ లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఓపెన్ రోడ్ ట్రాఫిక్‌ను అప్రమత్తంగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు మరియు గేట్మెన్ మరియు రైల్వే సిబ్బందిని సరైన రీతిలో విధులను కేటాయించి వారిని వినియోగించుకోవాలని తెలిపారు. ఆకతాయిల వల్ల కలిగే సిగ్నల్ కేబుల్ కోతలను పరిష్కరించడంలో అధికారులు వేగంగా స్పందించడాన్ని ప్రశంసించారు. పశువుల రన్ ఓవర్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. నిఘాను పెంచడానికి గూడ్స్ షెడ్లు మరియు ప్రైవేట్ సైడింగ్‌ల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సజావుగా రైలు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వాటి కార్యాచరణను నిర్ధారించే ఫాగ్ సేఫ్ పరికరాలు మరియు జి.పి.ఎస్ ట్రాకర్ల కార్యాచరణ సంసిద్ధతను నొక్కి చెప్పారు. అదనంగా, భద్రతా ప్రమాణాలను పెంచడానికి లోకోమోటివ్‌లు, రోలింగ్ స్టాక్, విద్యుత్ వ్యవస్థలు మొదలైన వాటిపై ఖచ్చితమైన డేటాను పొందుపరచడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణలను తీవ్రతరం చేయాలని , భద్రతా సంబంధిత సమస్యలు మరియు ప్రమాద విచారణలను సకాలంలో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. భద్రతా విభాగ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్సుల ద్వారా క్రమం తప్పకుండా శిక్షణ మరియు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. భద్రత అనేది నిరంతర బాధ్యతని మరియు జోన్ వ్యాప్తంగా రోజువారీ కార్యకలాపాలలో చేర్చాలని, చురుకైన మరియు జవాబుదారీ భద్రతా చర్యలను చేపట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.

