నైపుణ్యాభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు, అనుబంధ విభాగాలు పని చేయాలి -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుజిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహణ

నైపుణ్యాభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు, అనుబంధ విభాగాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
స్పష్టం చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో బుధవారం ప్రకాశం భవనములోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు.
జిల్లాలో పరిశ్రమల స్థితిగతులు, కొత్త వాటిని స్థాపించేందుకు అవకాశం ఉన్న రంగాలు, ఈ దిశగా ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న ఆర్థిక సహాయం, ఇప్పటికే వివిధ రంగాలలో ఉన్న వారికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ… కేవలం శిక్షణకే పరిమితం కాకుండా వ్యాపారాలను విస్తరించుకునేందుకు అవసరమైన డీ.పి.ఆర్ రూపకల్పన, బ్యాంకు రుణాల మంజూరు వంటి ప్రక్రియ పూర్తయ్యేంతవరకు తోడుగా నిలవాలని స్పష్టం చేశారు. ముడి సరుకుల లభ్యత నుంచి ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారాన్ని కచ్చితంగా అందించాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని కలెక్టర్ గుర్తు చేశారు. పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీపి వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినందున వాటి ప్రయోజనాలు అర్హులకు పూర్తిస్థాయిలో అందేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. నూతన పరిశ్రమల స్థాపన, విస్తరణ, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సమన్వయంతో సంబంధిత శాఖలు పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. నిర్దిష్ట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అవసరమైన బ్రాండ్ ప్రమోటర్స్, ప్రోడక్ట్ ప్రమోటర్లతో పాటు చార్టెడ్ అకౌంటెంట్లను ఆహ్వానిస్తే ప్రత్యేక సమావేశం నిర్వహించి చేతివృత్తిదారులకు జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, వివిధ ప్రభుత్వ పథకాలపై చేతి వృత్తుదారులకు అవగాహన కల్పించే సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *