ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వ అక్రమాలను, వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా అంతటా శుక్రవారం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా కేంద్రంలో ఎపీయూడబ్ల్యూజే నాయకులు, వివిధ మీడియా ప్రతినిధులు, సాక్షి విలేకర్లు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారు ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపై ఏకంగా కేసులు నమోదుచేయడం సరికాదని విమర్శించారు. ఇలా అయితే భవిష్యత్‌లో జర్నలిస్టులు వార్తలు రాయలేరని, ప్రభుత్వం వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికారంగంలో ఎన్నడూ లేనివిధంగా సాక్షిఎడిటర్ ఆర్ ధనుంజయరెడ్డిని విచారణల పేరుతో పలు దఫాలుగా వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తొలుత డీఆర్‌ఓ ఓబులేసు, డీఎస్ పిశ్రీనివాసులకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఎపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ. సురేష్ మాట్లాడుతూ ఎలాంటి వార్తలు రాయాలో పోలీసు వ్యవస్థ నిర్దేశించడం సరికాదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో జర్నలిస్టులు వార్తలు రాయలేరని అన్నారు. పత్రికా వ్యవస్థను కూల్చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చాక సాక్షి పత్రిక, మీడియాలపై కక్ష పూరితంగా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. అక్రమ కేసులు నమోదుచేసి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. జర్నలిస్టులపై నమోదుచేసిన అక్రమకేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పత్రిక ఎడిటర్‌ను, విలేకర్లపై విచారణ పేరుతో రకరకాలుగా ప్రశ్నలతో వేధిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండేలా జర్నలిస్టులపై కేసులు పెడుతోందన్నారు.మనం చేసిందే రూలింగ్ అన్న విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం జర్నలిస్టులు గొంతునొక్కేలా చూడడం సరికాదన్నారు. ప్రజల పక్షాన నిలిస్తే తప్పు అన్న విధంగా కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ ఆందోళనలో ఇంకా…. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఇఫ్తార్ భాషా, మాజీ ఉపాధ్యక్షులు మల్యాద్రి ఏపీ జె ఎఫ్ జిల్లా కార్యదర్శి సునీల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







