రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పండుగ సందర్భంగా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బాణసంచా వ్యాపారులు, తయారీదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను, అగ్నిమాపక (ఫైర్ సేఫ్టీ) ప్రమాణాలను పాటించాలన్నారు. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఫైర్ క్రాకర్స్ షాపులు, గోడౌన్లలో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించడానికి తగినన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు (అగ్నిమాపక పరికరాలు), నీరు, ఇసుక వంటి సామాగ్రిని సిద్ధంగా ఉంచుకున్నారా లేదా అని పరిశీలించారు. పరికరాలు పని చేస్తున్నాయా లేదా అని కూడా తనిఖీ చేశారు.
వ్యాపారులు అనుమతించిన పరిమాణంలోనే నిల్వ ఉంచుతున్నారా లేదా అధిక మొత్తంలో క్రాకర్స్ నిల్వ చేస్తున్నారా అనే దానిపై దృష్టి సారించారు. అనుమతి లేకుండా ఎవరైనా బాణాసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
బాణసంచా తయారీ లేదా విక్రయ కేంద్రాల్లో 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో ఉంచరాదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని యజమానులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని షాపులు, గోడౌన్లు, తయారీ కేంద్రాలు మరియు విక్రయ కేంద్రాలలో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిందని, ఈ తనిఖీలు పండుగ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలియజేశారు.


