సందేశాత్మక రచనలు, ఆట, పాటలతో సమాజం జాగృతం –
సామాజిక రుగ్మతలపై ప్రభాత భేరి మోగించాలి – కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తమ సృజనకు పదునుపెట్టాలి – ప్రభాత భేరిలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
హైదరాబాద్, అక్టోబర్ 19:
(జే ఎస్ డి ఎం న్యూస్) సందేశాత్మక రచనలు, ఆట, పాటలతో సమాజం జాగృతమవుతుందని, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సామాజిక రుగ్మతలపై ప్రభాత భేరి మోగించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సమాజంలో రుగ్మతలకు విరుగుడుగా సాహిత్యం, కళారూపాల ద్వారా చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఆదివారం రవీంద్రభారతీలో భాషా, సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారధి ఆద్వర్యంలో ప్రభాత భేరి – తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ. ఆనాటి సాంఘీక దురాచారాల మాదిరిగానే, నేటి ఆధునిక పోకడల మాటున కొత్త సామాజిక రుగ్మతలు సమాజాన్నిపట్టిపీడిస్తున్నాయని, కుటుంబ వ్యవస్థ విచ్ఛినమవుతుందని, ఆస్తి తగాదాలు, ఈర్ష్య ద్వేషాల కారణంగా కుటుంబ సభ్యులనే అంతమొందిచడం, మానవతా విలువలు లోపించడం, పెండ్లిలు, పేరంటాలకు అనవసరపు ఖర్చులు, కార్పోరేట్ విద్య, వైద్యంతో ఆర్థిక భారం, సెల్ ఫోన్లకు బానిసలు కావడం, సోషల్ మీడియాలో మునిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం, మాదక ద్రవ్యాలు, ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసలై ఆర్థికంగా నష్టపోవడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి ఆధునిక సమాజానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పర్చిన ఘనత సాహితీవేత్తలు, కవులు, కళాకారులదేనన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సమాజహితానికి కొత్త దారులు దారి చూపేలా తమ సృజనకు పదునుపెట్టాలని సూచించారు. సమాజంలో మార్పు కోసం, గతి తప్పిన జీవన విధానాన్ని గాడిన పెట్టేందుకు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు చైతన్యాన్ని, సరైన మార్గదర్శకత్వాన్ని, దశదిశను చూపాల్సిన సమయం ఆసన్నమైందని దిశానిర్ధేశం చేశారు. వినూత్నమైన రచనలతో, విభిన్నమైన ప్రదర్శనలతో ఇలాంటి సామాజిక రుగ్మతలపై ఒక కొత్త పోరాటం ప్రారంభించాలని, ప్రభాత భేరి మోగించి, ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కళలు, సంస్కృతి, సాహిత్యం, కళా ప్రదర్శనల (ఆట, పాట, నాటికలు, విధి నాటకాలు, బుర్రకథ, బ్రీత్ లెస్, ప్లాష్ మాప్, ధూమ్ ధామ్, వంటి భిన్న కళా రూపాలు ద్వారా నేటి రుగ్మతలపై పోరాడాలి, ప్రజలను ఆలోచింపజేయాలని కోరారు. అవి సమాజ రుగ్మతలపై చర్చకు దారీ తీయాలి, ప్రజల్లో చర్చ జరగాలి, తద్వారా సమాజంలో మార్పు రావాలని అప్పుడే తెలంగాణ భారతదేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజాలా, ప్రముఖ దర్శకులు నర్సింగరావు, ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రజా కవి జయరాజ్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్పింహారెడ్డి, సాహిత్య అకాడమీ సంచాలకులు నమోజు బాలాచారి, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు కవి యాకుబ్, పల్లె నర్పింహా, నెర్నాల కిషోర్,అంతడపుల నాగరాజు తదితరులు హాజరయ్యారు.


