జిల్లా క్లీన్ అండ్ గ్రీన్‌గా, ప్రజల ఆలోచనలు కూడా క్లీన్ అండ్ గ్రీన్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రకాశం జిల్లా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిలో సత్ ప్రవర్తన, సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 337 అసాంఘిక కార్యకలాపాలు జరగటానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటిని పోలీసు సిబ్బంది, స్ధానికుల సహకారంతో శుభ్రం చేశారు. దేవాలయాలు పరిసర ప్రాంతాలలో, స్కూల్/కాలేజీ పక్కన, గుబురుగా ఉన్న ప్రదేశాలు ఇలా అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టడం జరిగింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డు కట్టవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు తెలిపారు. ఒంగోలు సబ్ డివిజన్లో 93, దర్శి సబ్ డివిజన్లో 63, కనిగిరి సబ్ డివిజన్లో 47 మరియు మార్కాపురం సబ్ డివిజన్లో 134 ప్రదేశాలను శుభ్రం చేయించి, మొత్తం 337 ప్రదేశాలు శుభ్రం చేయబడ్డాయి.
బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి పట్టుబడిన వారిని… వారి మత్తు పూర్తిగా దిగే వరకు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా, వారు మద్యం తాగిన లేదా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిసర ప్రాంతాల్లోని చెత్త, చేదారాన్ని వారితోనే ఊడ్పించి, ఆ చెత్తకు నిప్పు పెట్టిస్తున్నారు. ఈ ప్రక్రియ కేవలం పారిశుద్ధ్యానికే పరిమితం కాకుండా, మందుబాబులలో అంతర్గత మార్పు తీసుకురావడానికి ఒక ప్రతీకాత్మక చర్యగా పోలీసులు ఉపయోగిస్తున్నారు. వారు మద్యం వల్ల కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే, డ్రోన్ కెమెరాల ద్వారా మద్యం తాగి అల్లరి చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టడం, ప్రజలను ఇబ్బందులు పెట్టిన, మహిళలను అల్లరి చేసిన అలాంటి వారిని క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు.
ఎవరైనా మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే వెంటనే స్పందించి స్ధానిక పోలీసు స్టేషన్‌కు, పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266 కు లేదా డయల్ 100/112 కు సమాచారం అందించవచ్చని అధికారులు తెలియజేశారు.


