భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండటంతో పాటు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
వాతావరణ శాఖ ప్రకాశం జిల్లా కు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రభుత్వం యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు మత్స్యకారులను అప్రమత్తం చేయడం జరిగింది.
తొలుత జిల్లా కలెక్టర్, సింగరాయకొండ తహసిల్దార్ కార్యాలయంను సందర్శించి భారీ వర్షాల నేపథ్యంలో చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు, చర్యలు పై సమీక్షించి మండల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని జిల్లా కలెక్టర్, మత్స్యకారులకు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఊళ్ళపాలెం గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించి అత్యవసర వైద్య సేవలకు సంబంధించి మందులు ఉన్నాయా లేవా అని పరిశీలించి, అవసరమైన అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సాయంత్రం నాటికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అవసరమైతే పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేయుటకు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అప్రమత్తంగా ఉండటంతో పాటు అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతవరం గ్రామాన్ని సందర్శించి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల పల్లెపాలెం ను సందర్శించి మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని జిల్లా కలెక్టర్, మత్స్యకారులకు తెలిపారు. అదే గ్రామంలో ఉన్న తుఫాన్ రక్షిత భవనాన్ని సందర్శించి, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తుఫాన్ రక్షిత భవనానికి తరలించినప్పుడు చేపట్టవలసిన ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్, అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కొత్తపట్నం బీచ్ ను సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని కోరారు. భారీ వర్షాల నేపధ్యంలో కొత్త పట్నంలో కొన్ని ప్రాంతాలు వర్షపు నీటితో మునిగే అవకాశం ఉందని, వర్షం నీరు సముద్రంలోకి వెళ్ళేలా అవుట్ లెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆ ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ… ప్రకాశం జిల్లాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి తుఫాన్ హెచ్చరికలు వచ్చిన నేపధ్యంలో అధికారులు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల పరిశీలన, ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ రోజు జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లోని సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం మండలాల్లోని మత్స్య కార గ్రామాలలో పర్యటించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సింగరాయకొండ మండలంలోని ఊళ్ళపాలెం పల్లెపాలెం ను , టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు, అనంతవరం గ్రామాలను, కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల పల్లెపాలెం, కొత్తపట్నం పల్లెపాలెంను సందర్శించి మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో పాటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని చెప్పడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న స్కూల్స్, తుఫాన్ రక్షిత కేంద్రాలను సందర్శించి తుఫాన్ పునరావాస కేంద్రాలుగా గుర్తించడంతో పాటు ఆ కేంద్రాల్లో విద్యుత్, భోజన వసతి, మరుగుదొడ్ల వసతి తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రాత్రికి వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అలాగే 50 నుండి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నదున, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం యంత్రాంగం సూచనలు చేసిన వెంటనే ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలకు రావాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ కళావతి, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిఆర్డిఏ పిడి నారాయణ, డీపీఓ వెంకటేశ్వర రావు, మత్స్య శాఖ జేడి శ్రీనివాస రావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బాల శంకర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, సంబంధిత మండలాల తహసిల్దార్లు, ఎంపిడిఓ లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.



