వెలుగొండ ప్రాజెక్టు పునరావాస, పునర్నిర్మాణ ( ఆర్ & ఆర్ ) ప్యాకేజీ అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల పనులు, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ పై బుధవారం ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ పనులలో పురోగతిని ప్రాజెక్ట్స్ ఎస్.ఈ. అబూత్ అలీమ్ వివరించారు. మొత్తం 11 గ్రామాలకుగాను రెండు గ్రామాలలో పునరావాస ప్యాకేజీకి లబ్ధిదారులను నిర్ధారించవలసి ఉందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నిర్వాసితుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయో, లబ్ధిదారులుగా గుర్తించేందుకు ఇలాంటివి అవసరమో వారికి తెలియజేయడంతో పాటు ఈ మొత్తం ప్రక్రియను బహిరంగంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ఆ గ్రామాల ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కాలువలు, సొరంగాల పనులకు, పునరావాస ప్యాకేజీకి అవసరమైన నిధులపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన చెప్పారు. ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివరామిరెడ్డి, సత్యనారాయణ, డీ.ఈ.ఈ.లు, ఏ.ఈ.ఈ.లు, డిప్యూటీ తహసిల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

