ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ… డ్రోన్ కెమెరాలతో నీటమునిగిన వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ, హెల్త్ మరియు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రాకపోకలకు సంబంధించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 18 ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు మీదుగా నీరు పొంగి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు.
ఒంగోలు తాలూకా, సంతనూతలపాడు , మద్దిపాడు ఎన్.జి.పాడు,టంగుటూరు ,ముండ్లమూరు , పామూరు , మార్కాపురం టౌన్ , కంభం గిద్దలూరు అర్బన్ ,రాచర్ల ,పెద్దారవీడు దోర్నాల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పలు వాగులు పొంగినట్లు గుర్తించారు.
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించటం జరిగింది.
నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి రోడ్లపై ప్రవహిస్తున్న చోట్ల, ప్రజలు రాకపోకలు లేకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.
అదనంగా, 18 ప్రదేశాల్లో 24 గంటలపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది.
వాగులు, నదులు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ముందస్తు చర్యలలో భాగంగా జేసీబీలు ఏర్పాటు చేయడం జరిగినది.
వాగులు, నదుల సమీప గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
వారధి ప్రవాహం మరింత పెరిగిన సందర్భంలో, ప్రజలు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పునరావాస కేంద్రాల్లో ఆహార పదార్థాలు, అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు పోలీసులు ప్రజలకు తెలియజేశారు.
చిన్న పిల్లలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి, ముందస్తు చర్యలలో భాగంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎస్పీ సిబ్బందికి ఆదేశించారు.
వాగులు, నదుల సమీపంలో నివసిస్తున్న ప్రజలు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం లభించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పోలీసు సిబ్బందికి సూచించారు.




